బడిగంటకు వేళాయె..

Schools In Telangana To Reopen On June 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బడిగంటకు సమయం ఆసన్నమైంది. 49 రోజుల వేసవి సెలవుల అనంతరం శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత తగ్గనప్పటికీ.. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో వేసవి సెలవులు ముందుకు జరిగాయి. వార్షిక విద్యా ప్రణాళికను ఖరారు చేసిన ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు బడిబాటకు శ్రీకారం చుట్టింది. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాక జూన్‌ 4 నుంచి 8 వరకు బడిబాట నిర్వహిస్తోంది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు బడిబాట నిర్వహించాలని తెలిపింది. బడిబాటలో టీచర్లు రొటేషన్‌ పద్ధతిలో పాల్గొనాల్సి ఉంటుంది. అలాగే జూన్‌ 4 నుంచి 8 వరకు పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించనుంది. ఒంటిపూట ఉన్న రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగుతాయి.  

తొలిరోజే యూనిఫాం.. 
పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు అందిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇప్పటికే స్పష్టం చేశారు.  కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో యూనిఫాం, పుస్తకాలు పాఠశాలలకు చేరలేదు. వీటిపై విద్యా శాఖ అధికారుల వద్ద కూడా స్పష్టమైన గణాంకాలు లేకపోవడం గమనార్హం. కాగా, టీచర్ల నియామకాలకు ఈ ఏడాది మార్చిలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత నియామకాల ప్రక్రియ చేపట్టినా.. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి కూడా వలంటీర్లతోనే బోధన నిర్వహించే పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top