ఆర్టీసీ సమ్మె : బడికి బస్సెట్ల! | Sakshi
Sakshi News home page

బడికి బస్సెట్ల!

Published Mon, Oct 21 2019 8:24 AM

Schools And Colleges Reopen in Telangana Still Suffering For Busses - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం పొడిగించిన దసరా సెలవులు ఆదివారంతో ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఓవైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడం, మరోవైపు తరగతుల మూడో రోజు నుంచే పరీక్షలు ప్రారంభమవుతుండడంతో బస్సు సేవలపై ఆధారపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు అరకొరనే తిరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లోని కళాశాలలకు వెళ్లేది ఎలా? అని స్టూడెంట్స్‌ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 10వేల వరకు ఉన్నాయి. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 15 లక్షల మంది చదువుకుంటున్నారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... సమ్మె నేపథ్యంలో సెలవులను 19 వరకుపొడిగించిన విషయం విదితమే. సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతుండగా... 23 నుంచి 30 వరకు సమ్మెటీవ్‌–1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖప్రకటించింది. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోపాఠశాలలకు ఎలా చేరుకోవాలని విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.

పాసులు 3.50 లక్షలు  
గ్రేటర్‌లో 890 ఇంటర్మీడియెట్‌ కాలేజీలుఉండగా... వీటిలో నాలుగున్నర లక్షల మంది చదువుకుంటున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఇతర కాలేజీలు మరో 900 వరకు ఉండగా... వాటిలో 6లక్షల మంది విద్యార్థులున్నారు. సాంకేతిక వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీల్లో చాలా వరకు దేశ్‌ముఖ్,  ఇబ్రహీంపట్నం, చెంగిచర్ల, నారపల్లి, ఘట్‌కేసర్, భువనగిరి, సూరారం, బాచుపల్లి, లింగంపల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం,మొయినాబాద్, షాద్‌నగర్, శంషాబాద్‌ పరిసరాల్లోనే ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో 4.50 లక్షల బస్సు పాసులు ఉండగా... వీటిలో 3.50 లక్షల పాసులు విద్యార్థులవే. ఆయా కాలేజీల విద్యార్థుల రవాణాకు ఆర్టీసీ బస్సులే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.శివార్లలోని నల్లగొండ, భువనగిరి, మేడల్చ్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, చేవేళ్ల జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్లో చాలా మంది నగరంలోనే ఉంటున్నారు. వీరంతా రోజూ ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు. వీరూ సోమవారం నుంచి ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.  

Advertisement
Advertisement