ఉపకారానికి అడ్డంకులు..

Scholarship Pending For Post Matric Students In OU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల మంజూరీకి మరిన్ని అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఇప్పటివరకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో మంజూరీలో జాప్యం జరుగుతుండగా.. ప్రస్తుతం సంక్షేమ శాఖల వద్ద అందుబాటులో అంతో ఇంతో నిధులున్నా వాటిని పంపిణీ చేయడంలో సమస్యలు నెలకొన్నాయి. ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో విద్యార్థులు చదువుతున్న కోర్సుకు సంబంధించి ట్యూషన్‌ ఫీజును సంబంధిత యూనివర్సిటీ అప్‌డేట్‌ చేయకపోవడంతో విద్యార్థి దరఖాస్తును మంజూరు చేయడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. పోస్టుమెట్రిక్‌ కోర్సులకు సంబంధించి ఫీజులను కాలేజీకి గుర్తింపు ఇచ్చే బోర్డు లేదా యూనివర్సిటీ నిర్ధారిస్తూ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలి. అదేవిధంగా ఫీజులకు సంబంధించి వర్సిటీ నిర్ణయాలు తదితర సమాచారాన్ని మాన్యువల్‌ పద్ధతిలో సంక్షేమ శాఖలకు సమర్పించాలి. దీనిలో భాగంగా మెజారిటీ యూనివర్సిటీలు సమాచారాన్ని ఇచ్చినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అత్యధిక కాలేజీలున్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజు స్ట్రక్చర్‌ అందకపోవడంతో సంక్షేమ శాఖాధికారులు దరఖాస్తుల పరిశీలనను పక్కనపెట్టారు. 

ఉపకార వేతనాలకు ఇబ్బందులు.. 
2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకార వేతనాలను ఫిబ్రవరి నెలాఖరు కల్లా క్లియర్‌ చేయాలని సంక్షేమ శాఖలు భావించాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన మొదలు పెట్టేందుకు ఉపక్రమించగా.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫీజ్‌ స్ట్రక్చర్‌ అందకపోవడంతో ఆయా దరఖాస్తులను పక్కనపెట్టాయి. రాష్ట్రంలో పోస్టుమెట్రిక్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ఉపకార వేతనాలు ఇచ్చేందుకు బడ్జెట్‌ అందుబాటులో ఉంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి నెలాఖరులోగా సీనియర్‌ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన చేసే అధికారులకు ఫీజు స్ట్రక్చర్‌ కనిపించకపోవడంతో వాటి పరిశీలన నిలిపివేస్తున్నారు. పరిశీలన ప్రక్రియ నిలిచిపోతే విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అధికారులు స్పందించడం లేదు.. 
2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసి నాలుగు వారాలైంది. ఇప్పటివరకు ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం కోర్సుల వారీగా ఫీజు స్ట్రక్చర్‌ను ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయలేదు. దీంతో ఆయా విద్యార్థుల దరఖాస్తులను పరిష్కరించలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో నిధులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఫీజ్‌ స్ట్రక్చర్‌ అప్‌డేట్‌ కాకపోవడంతో అధికారులు ఈ యూనివర్సిటీ పరిధిలోని దరఖాస్తులను పక్కకు పెడుతున్నారు. ఈ అంశాన్ని 15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ వర్సిటీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు.     – గౌరి సతీశ్, రాష్ట్ర కన్వీనర్,  ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top