లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

Sangareddy MLA Jagga Reddy Announces Dharna On August 10 - Sakshi

వచ్చే నెల 10న నిర్వహిస్తాం.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డికి గోదావరి జలాలుతరలించేందుకు ఈ నెల 30లోగా ప్రకటన చేయాలి

సంగారెడ్డి ప్రజలు నీటికోసం అల్లాడుతున్నారు  

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల నీటిగోస తీర్చడానికి గోదావరి జలాలను తరలించే పనులు వెంటనే చేపట్టకపోతే వచ్చే నెల 10న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ, అనంతరం ధర్నా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరుకు ప్రధాన వనరులైన సింగూరు, మంజీరా డ్యాంలు ఎండిపోవడంతో నీటి కటకట ఏర్పడిందన్నారు. దీంతో ప్రజలు కనీసం తాగునీటికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి, సదా శివపేట మున్సిపాలిటీలతో పాటుగా నియోజకవర్గంలోని మండలాల్లో ఏర్పడిన నీటి కొరతను తీర్చాలని గత రెండు, మూడు నెలలుగా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.

రైతులు సాగునీరు లేక, ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అందువల్ల తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పటాన్‌చెరు వరకు సరఫరా అవుతున్న గోదావరి జలాలను సంగారెడ్డి వరకు తరలిస్తామని ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం, అధికారులు స్పష్ట ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా ప్రకటన వెలువడిన వెంటనే పనులు కూడా ప్రారంభం కావాలన్నారు. లేకపోతే ఆగస్టు 10వ తేదీన స్థానిక అంబేడ్కర్‌ గ్రౌండ్‌లో లక్షమంది ప్రజలతో మొదటగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగుతున్నానని వెల్లడించారు.

ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తనకు రాజకీయాల కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని తెలిపారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇతర నియోజకవర్గాలకు తరలించి సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలకు టీఆర్‌ఎస్‌ నేతలే బాధ్యులన్నారు. సంగారెడ్డి సమీపంలోని మహబూబ్‌సాగర్‌ చెరువును కాళేళ్వరం నీటితో నింపుతానని గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్న హరీష్‌రావు స్వయంగా ప్రకటించారనే విషయాన్ని గుర్తుచేశారు. 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి తరలిస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతలు గోదావరి జలాలు తేవడం సాధ్యమవుతుందనే భావిస్తున్నానని చెప్పారు.  కర్ణాటకలో వరదలు వస్తేనే సింగూరు, మంజీరా నిండే దౌర్భాగ్య పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా... ఈ నెల 30లోగా నీటి తరలింపుపై ప్రకటన చేసి పనులు ప్రారంభించండి...లేదా వచ్చే నెల 10న లక్ష మందితో ధర్నా చేస్తానని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top