వాగులో రాత్రిళ్లు తోడేస్తున్నారు..

Sand Mafia On Nizamabad In Night Times - Sakshi

జోరుగా ఇసుక అక్రమ రవాణా 

రామన్నపేట్‌ కేంద్రంగా దందా  

భారీగా ఇసుక నిల్వలు 

దళారుల పంట పండిస్తున్న వ్యాపారం 

ఓ పక్క ఎన్నికల వేళ.. మరోపక్క అధికారులు విధుల్లో బిజీ. ఇంకేముంది ఇసుకాసురులకు ప్రతి రోజూ పండుగే అవుతోంది. ప్రస్తుత పరిస్థితులను క్యాష్‌ చేసుకుంటున్న ఇసుక అక్రమార్కులు పెద్దవాగు రాత్రివేళల్లో డంపింగ్‌ చేసి పగలు జంపింగ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకున్నా ఇసుక వ్యాపారులు తవ్వేస్తున్నారు. సాధారణ రోజుల్లోకంటే రెట్టింపు ధరలకు ఇసుకను అక్రమ వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.

సాక్షి,వేల్పూర్‌: మండలంలోని రామన్నపేట్‌ గ్రామం నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్దవాగు నుంచి రాత్రిపూట ఇసుకను గ్రామం బయట గల అయ్యల గుట్ట వద్ద డంపు చేస్తున్నారు. చుట్టు పక్కల అవసరమైన వారికి పగటి పూట సరఫరా చేయడం జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో, దొరికిన అవకాశాన్ని దళారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ అనుమతితో ఇసుక సరఫరాను అధికారులు నిలిపేశారు.

ఇండ్లు నిర్మించేకునే వారికి ఇసుక లభించక విలవిలలాడుతున్నారు. దీంతో ఇసుకకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. సాధారణ రోజుల్లో లభించే రేటుకు రెట్టింపు ధర పెరిగింది. దీనిని దళారులు గుర్తించి తమ వ్యాపారానికి పదును పెట్టారు. ఎక్కడ అవకాశం దొరికినా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రామన్నపేట్‌ గ్రామం పక్కన పెద్దవాగు ఉంటుంది. స్థానికి వీడీసీకి ట్రాక్టరుకు రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తూ వ్యాపారులు రాత్రిపూట ట్రాక్టర్ల ద్వారా అయ్యల గుట్ట వద్ద ఇసుకను నిల్వ చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అటువైపు ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఇతరులు అటువైపు వెళ్లే అవకాశం లేదు. ఇతర గ్రామాల వారుగాని, అధికారులుగాని చూడని ప్రాంతాన్ని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నారు.

ప్రభుత్వ అధికారుల అనుమతితో నడిచే ఆసుక ఆగిపోవడంతో, దళారులు తమ వ్యాపారాన్ని ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు టిప్పర్లు’గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ. 7 నుంచి 8 వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కూలీలతో ఇసుక నింపితే బయట తెలుస్తుందని దళారులు ఏకంగా జేసీబీలనే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వాగులో ఒకటి, అయ్యల గుట్ట వద్ద మరో జేసీబీని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఇసుక అవసరమైన వారికి కొద్ది గంటల్లోనే చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఇసుక సరఫరాను నిషేధించడంతో అధికారులు అటువైపు దృష్టి పెట్టడం లేదు. దీనికి తోడు ఎన్నికల విధుల్లో చాలా బిజీగా ఉన్నారు. అధికారులకు ఉన్న బిజీ ఇసుక వ్యాపారుల పంట పండిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క వేల్పూర్‌ మండలంలోనే లేదు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top