రాత్రిబడికి రాంరాం

Saakshar Bharat Programme Ending Without Positive Response - Sakshi

నేటితో ముగియనున్న సాక్షరభారత్‌ గడువు

పేరుకే కేంద్రాలు, ఆసక్తి చూపని గ్రామీణులు

మూడు నెలలుగా సమన్వయకర్తలకు వేతనాలు కరువు 

ఖమ్మంకల్చరల్‌ : గ్రామాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన సాక్షరభారత్‌ పథకం (రాత్రి బడి)కి ఈనెల 31తో గడువు ముగుస్తుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 1600 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. పలు గ్రామాల్లో నిరక్షరాస్యులు రాత్రిబడికి రాకపోవడంతో కేంద్రాలను నెలల తరబడి తెరవని పరిస్థితి నెలకొంది. ఈనెల 31వ తేదీతో పథకం ముగియనుంది. ఇదే పేరుతో తిరిగి కొనసాగిస్తారా...? లేదా మూసివేస్తారా...? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రామ, మండల సమన్వయకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లో 631 గ్రామ పంచాయతీలు ఉండగా 36 మంది మండల సమన్వయకర్తలు, 1262 మంది గ్రామ సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలో 427 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి జిల్లాలో 204పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యులు 14,33,894 మంది, నిరక్షరాస్యులు 3,99,153 మంది, ఖమ్మం జిల్లాలో అక్షరాస్యులు 8,32,320, కొత్తగూడెం జిల్లాలో 6,01,574 మంది ఉన్నారు. ఇక నిరక్షరాస్యులు ఖమ్మంలో 2,19,108 మంది, కొత్తగూడెం జిల్లాలో 1,80,045 మంది ఉన్నారు.  

లక్ష్యం చేరకముందే ముగిసే.. 
ప్రతి వ్యక్తి తనకుతాను సంతకం చేయడం, పత్రికలు, పుస్తకాలు చదివేలా చేయాలన్నదే సాక్షరభారత్‌ లక్ష్యం. గ్రామాల్లో స్త్రీ, పురుషుల వివరాలు సేకరించాలి. వారిలో చదువురాని  వారిని గుర్తించి కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో  వంత శాతం అక్షరాస్యత సాధించాలి.

ప్రతి గ్రామంలో సాక్షర భారత్‌ కేంద్రాల ద్వారా స్త్రీలకు చదువు నేర్పాలి. అభ్యాసకుడికి పుస్తకం, నోట్‌బుక్‌ ,పెన్సిల్‌ ఇవ్వాలి. అయితే..పూర్తిస్థాయిలో ఇది లక్ష్యం చేరలేదు. వేతనాలు, కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లు చూడాలి. కానీ స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కరువైంది.  

మూడు నెలలుగా వేతనాల్లేవ్‌.. 
ప్రతి గ్రామంలో ఇద్దరు గ్రామ సమన్వయకర్తలు ఉంటారు. ఒక్కొక్కరికీ రూ.రెండు వేలు, మండలానికి ఒక సమన్వయకర్త ఉండగా..రూ. 6 వేల చొప్పున వేతనాలు ఇవ్వాలి. మండల కోఆర్డినేటర్లకు టీఏ, డీఏలు నెలకు రూ. 500 అందిస్తారు. ఎంపీడీఓలు వీటిని మంజూరు చేస్తారు. అయితే గత మూడు నెలలు వీడి చెల్లింపులు నిలిచాయి. వేతనాలను అందజేయడంతో పాటు ఈ పథకం గడువు పెంచాలని వారు కోరుతున్నారు. 

పునరుద్ధరిస్తారనే నమ్మకముంది.. 
ఈనెల 31తో సాక్షరభారత్‌ గడువు ముగుస్తుంది. మరో సరికొత్త పేరు, ప్రణాళికతో ఈ పథకాన్ని కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఇప్పుడు సాక్షరభారత్‌ కింద పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగిస్తారా..? వేరే దేనికైనా బదాలయింపు చేస్తారా..? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.  
–ధనరాజ్, సాక్షరభారత్‌ డీడీ

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top