ఖాతాల్లోకి ‘సాయం’

Rythu Bheema Scheme Cheques Distribution Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉత్కంఠకు తెరపడింది.. రైతుబంధు పెట్టుబడి పంపిణీకి ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లాలో రబీలో అందించే రెండో విడత రైతు పెట్టుబడి సాయం అందజేసేందుకు మార్గం సుగమమైంది. మొదటి విడతలో అందించిన విధంగానే రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో వచ్చిన కోడ్‌ ప్రభావంతో హడావిడి లేకుండానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించా రు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఖరీఫ్‌లో రూ.4 వేలు, రబీలో రూ.4 వేలు ఇలా ఏడాదికి రూ.8 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ  ఏడాది మేలో ఖరీఫ్‌ సాయం అందించారు. ఈ నెల 5 నుంచి రబీ సాయం చెక్కులు పంపిణీ జరగాల్సిండగా శాససభ రద్దుతో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పథకం అమలుకు ఎన్నికల సంఘం పలు షరతుల విధించింది.

తొలి విడతలో అందుకున్న వారికే.. 
జిల్లాలో ఖరీఫ్‌కు 1,69,731 మంది పట్టాదారులుండగా రూ.130,02,09,000 విలువ చేసే 1,70,292 చెక్కులు వచ్చాయి. అందులో రూ.119,79,62,250 విలువ చేసే 1,50,224 చెక్కులు రైతులు అందుకున్నారు. రూ.10,09,98,410 విలువ చేసే 20,068 చెక్కులు రైతులు తీసుకోలేదు. మొదటి విడతలో చెక్కులు అందుకున్న వారికే రబీలో సాయం అందించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఖరీఫ్‌లో చెక్కులు అందుకున్న వారిలో పలువురు రైతులు మరణించారు. దీంతో రబీలో 1,48,581 మంది పట్టాదారులకు రూ.118,99,94,630 విలువ చేసే 1,49,095 చెక్కులు మంజూరయ్యాయి.

ఆరు బ్యాంకులు.. 
జిల్లాలో ఆరు నోటిఫైడ్‌ బ్యాంకులను ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఐఓబీ, ఏపీజీవీబీ, సిండికేట్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను గుర్తించారు. ఆయా బ్యాంకుల చెక్కులు జిల్లాకు రానున్నాయి. ఇప్పటి వరకు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు సంబంధించిన నెక్కొండ, నర్సంపేట, పర్వతగిరి, ఆత్మకూరు మండలాలకు చెందిన రైతుల 50,573 చెక్కులు జిల్లాకు శనివారం హైదరాబాద్‌ నుంచి వ్యవసాయ శాఖ అధికారులు తీసుకొచ్చారు. వీటిని ఆయా మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లలో భద్రపరచనున్నారు. ఆంధ్రాబ్యాంకుకు నల్లబెల్లి, పరకాల, గీసుకొండ, సంగెం, శాయంపేట మండలాలు, ఎస్‌బీఐకి దామెర, చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలు కేటాయించగా సిండికేట్‌ బ్యాంక్‌కు రాయపర్తి, కార్పొరేషన్‌ బ్యాంక్‌కు ఆత్మకూరు, ఏపీజీవీబీకి ఖానాపూర్‌ మండలాలకు ఆయా బ్యాంకుల చెక్కులు త్వరలో తీసుకురానున్నారు.

మార్గదర్శకాల కోసం.. 
పెట్టుబడి సాయాన్ని రైతులకు నేరుగా చెక్కులు రూపంలో అందించకుండా ఖాతాలో జమ చేయాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. దీంతో చెక్కుల పంపిణీని వ్యవసాయ అధికారులు నిలిపివేశారు. రైతుల బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లు సేకరించి ప్రభుత్వం అందించిన చెక్కులను వారి ఖాతాల్లో జమ చేస్తారా, చెక్కులు బ్యాంకులో వేయకుండా నేరుగా రైతు ఖాతాలోకి ఆర్‌టీజీఎస్‌ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. త్వరలో స్పష్టత రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఆదేశాలు రాలేదు
రైతుబంధు సాయం అందించేందుకు రైతుల నుంచి బ్యాంకు అకౌంట్‌ నంబర్లు  సేకరించాలని ఆదేశాలు రాలేదు. చెక్కుల పంపిణీ మాత్రం నిలిపివేయాలని చెప్పారు. ఉన్నతాధికారులు ఎలా చెప్పితే అలా పాటిస్తాం. కొన్ని చెక్కులు జిల్లాకు చేరుకున్నాయి. – ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top