ఆరు గంటల్లో ఆర్‌యూబీ రెడీ | RUB Ready Six Hours in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆరు గంటల్లో ఆర్‌యూబీ రెడీ

May 13 2019 7:14 AM | Updated on May 13 2019 7:14 AM

RUB Ready Six Hours in Hyderabad - Sakshi

ఆర్‌యూబీ రెడీ..

సనత్‌నగర్‌:  సరిగ్గా ఆరంటే ఆరు గంటల్లో ఆర్‌యూబీ (రైల్వే అండర్‌ బ్రిడ్జి) నిర్మాణం పూర్తి చేసి రైల్వే అధికారులు రికార్డు సృష్టించారు. బేగంపేట ఓల్డ్‌కస్టమ్స్‌ బస్తీ నుంచి అమీర్‌పేట లీలానగర్‌కు కలిపేలా ఈ ఆర్‌యూబీ నిర్మాణం జరిపారు. దీంతో ఏన్నో ఏళ్లుగా పట్టాలు దాటుతూ నానా కష్టాలు పడుతున్న ఆయా ప్రాంతాల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 11.30 గంటలకు చివరి ఎంఎంటీఎస్‌ రైలు వెళ్లాక ఆర్‌యూబీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న రైల్వే అధికారులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా పట్టాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తరువాత జేసీబీల సహాయంతో కట్టను తవ్వారు. దాదాపు 400 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ క్రేన్‌ సహాయంతో భారీ బ్లాక్‌లను లిఫ్ట్‌ చేసి నిర్దిష్టమైన ప్రాంతంలో ఉంచారు. అలా తొమ్మిది బ్లాక్‌లను ఒక దాని వెంట ఒకటి ఏర్పాటుచేసుకుంటూ రావడంతో వాటి మధ్య మార్గం ఏర్పడింది. బ్లాక్‌ల అమరిక ప్రక్రియ పూర్తయిన వెంటనే యధావిధిగా కట్టను నిర్మించి పట్టాలను పునరుద్ధరించారు. ఆరు గంటల సమయంలో ఎక్కడా ఏ ఒక్క నిమిషం కూడా జాప్యం చేయకుండా సమన్వయంతో పనులను పూర్తి చేయగలిగారు.  ఆర్‌బీయూ నిర్మాణాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే నిర్మాణ పనులకు కొద్ది దూరంలోనే పోలీసులు వారిని నిలుపుదల చేశారు.

నెరవేరిన దశాబ్దాల కల..
ఎట్టకేలకు ఓల్డ్‌కస్టమ్స్‌బస్తీ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. పట్టాలపై నుంచి లీలానగర్‌ వైపు వచ్చే క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో,  రైల్వే రక్షక దళ సిబ్బంది కంట పడి జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందోనని ఆందోళనతో వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈ ఆర్‌యూబీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జీహెచ్‌ఎంసీ నుంచి రూ.2.18 కోట్లను విడుదల చేయించి ఆ నిధులను రైల్వే శాఖకు అందజేశారు.  రైల్వే శాఖ అనుమతికి జాప్యం నెలకొనడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి కూడా తీసుకువచ్చారు. అలా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడంతో పట్టాలపై నుంచి వెళ్ళే అవసరం లేకుండా ఎంచక్కా ఆర్‌యూబీ మార్గంలో తమ రాకపోకలు సాగించవచ్చని ఓల్డ్‌కస్టమ్స్‌బస్తీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది తమకు రంజాన్‌ కానుకగా అక్కడి ముస్లిం సోదరులు పేర్కొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో రైల్వే అధికారులతో పాటు జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, ఎలక్ట్రికల్‌ తదితర విభాగాల అధికారులు తమవంతు భాగస్వామ్యం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement