హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు

RTC Buses Are Limited Rounding In Warangal Region Due To RTC Strike - Sakshi

సాక్షి, హన్మకొండ : ఓ పక్క ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండగా.. మరో పక్క తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో అధికారులు బస్సులు నడుపుతున్నారు. కానీ ఈ బస్సులు పూర్తి స్థాయి రూట్లలోకి వెళ్లడం లేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయేవి. ఈసారి కార్మికుల సమ్మెను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇతర శాఖల అధికారులను రంగంలోకి దింపి డిపోల వారీగా నోడల్‌ అధికారులుగా నియమించింది.

ఈ మేరకు నడుపుతున్న బస్సులో అ«ధిక శాతం ప్రధాన రూట్లలోనే పరుగులు పెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడం లేదు. ఒక్కటి, రెండు గ్రామాలు మినహా మిగతా గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు చూడక 13 రోజులైంది. ఫలితంగా వారు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో దీంతో బస్టాండ్లలో ప్రయాణికుల కంటే బస్సులే అధికంగా కనిపిస్తున్నాయి.

పాయింట్ల వద్ద పడిగాపులు
హన్మకొండ జిల్లా బస్‌ స్టేషన్‌లో శుక్రవారం పరిశీలించగా బస్సులు బారులు తీరి ఉన్నా ప్రయాణికులు అంతంత మాత్రంగానే కనిపించారు. ఫలితంగా బస్సు డ్రైవర్లు చాలాసేపు ప్రయాణికుల కోసం బస్‌ పాయింట్ల(ప్లాట్‌ ఫాం) వద్ద వేచి చూస్తూ గడిపారు. బస్సులు పెద్దసంఖ్యలో ఉండడంతో ప్లాట్‌ఫాం ఖాళీ కాగానే అక్కడ బస్సు ఆపేందుకు తాత్కాలిక డ్రైవర్లు పోటీ పడుతున్నారు. తానంటే తానే ముందు వచ్చానని పోట్లాడుకుంటూ బస్సులను తీసుకొస్తుండడంతో ఎక్కడ ఢీకొటంటాయోనన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఇక కొన్ని రూట్లలో గంటల కొద్ది బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు నిరీక్షిస్తూ కూర్చుంటున్నారు. ప్రైవేట్‌ బస్సులను కూడా బస్టాండ్లలోకి అనుమతిస్తున్నా.. స్థలం సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద శాతం బస్సులు నడపాలని ప్రయత్నిస్తున్న అధికారులు ప్రధాన రూట్లలోనే నడుపుతూ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నారు. 

జిల్లాలో 726 బస్సులు..
వరంగల్‌ రీజియన్‌లో 13వ రోజైన శుక్రవారం ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. ఈ మేరకు రీజియన్‌లోని 942 బస్సులకుగాను 726 బస్సులు రోడ్లపై పెరుగులు పెట్టాయి. అలాగే, రాజధాని ఏసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వజ్ర బస్సులు మినహా మిగతా బస్సులన్నీ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా 522 ఆర్టీసీ బస్సులు, 204 అద్దె బస్సులు కలిసి మొత్తం బస్సుల్లో 77 శాతం బస్సులు నడిచాయి. ఈ బస్సుల నిర్వహణ కోసం 522 మంది తాత్కాలిక డ్రైవర్లు, 726 తాత్కాలిక కండక్టర్లను నియమించగా, 281 బస్సులను టికెట్లతో, 413 బస్సులను టిమ్‌లతో నడిపారు.

తాత్కాలిక కండక్టర్ల చేతివాటం
టికెట్లతో నడుపుతున్న బస్సుల్లో కొందరు తాత్కాలిక కండక్టర్లు చేతివాటానికి పాల్పడుతున్నారు. ప్రయాణికులకు ఇచ్చిన టికెట్లను వారు దిగే సమయంలో మళ్లీ తీసుకుని ఇంకొకరికి ఇస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, కొన్ని తక్కువ చార్జీ టికెట్లపై ఎక్కువ ధర రాసి ఇస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top