విద్యుత్‌ బకాయిలు..రూ.167.42 కోట్లు..!

Rs.167.42 Cr..pending Current bills - Sakshi

నోటీసులు జారీ చేసినా స్పందించని అధికారులు

నిధుల సమస్యతో బిల్లులు చెల్లించడం మానేసిన శాఖలు

బకాయిలపై 18 శాతం సర్‌చార్జీల వడ్డింపు

నల్లగొండ : విద్యుత్‌ బిల్లుల బకాయిల భారం విద్యుత్‌శాఖకు పెద్ద గుదిబండలా మారింది. ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించడం మానేశారు. నిధుల సమస్యను కారణంగా చూపించి విద్యుత్‌ బిల్లులు  చెల్లించకుండా మొండికేశారు. దీంతో ఏటికేడు పెరిగిపోతున్న బకాయిలను వసూలు చేయడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. విద్యుత్‌ శాఖ నుంచి పలుమార్లు నోటీసులు జారీ చేసినా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు.

ప్రతి నెలా విద్యుత్‌ శాఖ నిర్వహించే నెలవారీ విద్యుత్‌ శాఖ సమీక్షా సమావేశంలో ఈ బకాయిల పైన ఉన్నతాధికారులు చివాట్లు పెడుతున్నా బిల్లులు మాత్రం వసూలు కావడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మేజర్, మైనర్‌ పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు మొత్తం రూ.167.42 కోట్లు అని తేలింది. దీంట్లో గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చెల్లించాల్సిన బకాయిలు రూ.44 కోట్లు. కాగా పాత బకాయిలతో కలుపుకుని మొత్తం రూ.167.42 కోట్లు. వీటిల్లో ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.3.21 కోట్లు కాగా, మున్సిపాలిటీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.3.74 కోట్లు, మేజర్, మైనర్‌ పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు.

పేరుకుపోయిన బకాయిలు..
జిల్లా కేంద్రంలోని 26 ప్రభుత్వ శాఖల్లో బిల్లులు చెల్లించకుండా మొండికేసిన శాఖల్లో విద్యాశాఖ రూ.కోటి 32 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా పాఠశాలల హెచ్‌ఎంల నుంచి స్పందన ఉండటం లేదన్నారు. విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నారని విద్యాశాఖ చెప్తోంది. కానీ హెచ్‌ఎంలు మాత్రం వచ్చిన కొద్దిపాటి నిధులు పాఠశాలల నిర్వహణకే సరిపోతున్నాయని, దాంతో బిల్లులు చెల్లించడం కష్టం మారిందని అంటున్నారు.

పోలీస్‌ క్వార్టర్స్‌కు సంబంధించి కోటి రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శిథిలావస్థకు చేరుకున్న పోలీస్‌ క్వార్టర్స్‌ బకాయిలు ఇవి. నెలవారీ బిల్లుల చెల్లింపులో పోలీస్‌ శాఖ మొదటి స్థానంలో ఉంది. కానీ క్వార్టర్స్‌ బకాయిలను సెటిల్‌ చేసుకోకపోవడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయాయి. వ్యవసాయ శాఖ రూ.3.08 లక్షలు, పశుసంవర్థక శాఖ రూ.లక్షా 92 వేలు, ఉన్నత విద్య రూ.లక్షా 94 వేలు, సాగునీటి పారుదల శాఖ రూ.57.41 లక్షలు, రెవిన్యూ శాఖ రూ.7 లక్షలు, రవాణా శాఖ రూ.5.97 లక్షలు చెల్లించాల్సి ఉంది.

ఈ శాఖలకు సంబంధించి నిధులు సర్దుబాటుకాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని, వచ్చిన కొద్దిపాటి నిధులు కూడా ఫ్రీజింగ్‌ల పేరుతో ట్రెజరీ శాఖ నిలిపేస్తుందని అంటున్నారు. ప్రతి నెలా క్రమతప్పకుండా బిల్లులు చెల్లి స్తున్న శాఖల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, వైద్య ఆరోగ్యం, పోలీస్‌ శాఖలు ఉన్నాయి.  

బిల్లులు చెల్లించక రెండేళ్లు...! 
మున్సిపాలిటీలు, మేజర్, మైనర్‌ పంచాయతీలు బిల్లులు చెల్లించక రెండేళ్లు దాటింది. పంచాయతీలు చివరిసారిగా జనవరి 2016లో చెల్లించారు. ఇక ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు. మున్సిపాలిటీల బకాయిలు రూ.3.74 కోట్లు ఉండగా, పంచాయతీలు చెల్లించాల్సింది రూ.160.47 కోట్లు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమచేస్తున్న నాటి నుంచి సర్పంచ్‌లు బిల్లులు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు.

స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల్లో 30 శాతం విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్మన్లు పాటించడం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో వీధిలైట్ల విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. తాగునీటి బోర్లకు విద్యుత్‌ కట్‌ చేయడం సాధ్యం కానందున చర్యలు తీసుకులేకపోతున్నామని అంటున్నారు. మున్సిపల్‌ కార్యాలయాలకు విద్యుత్‌ సర ఫరా నిలిపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ మేరకు కమిషనర్లకు నోటీసులకు కూడా జారీ చేశామని చెప్పారు. 
 

సర్‌చార్జీల భారం...
విద్యుత్‌ బకాయిల పైన సర్‌చార్జీల పేరుతో 18 శాతం అదనపు భారాన్ని వసూలు చేయడం జరుగుతోంది. ఈ తరహా చార్జీలు అన్ని రకాల కేటగిరీలకు చెందిన బిల్లులకు వర్తిస్తుంది. ప్రతిఏడాది 18 శాతం సర్‌చార్జీల పేరుతో వినియోగదారులు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు అదనపు భారాన్ని మోయాల్సిందే.

ఎంతకాలం పాటు బిల్లులు చెల్లించకుండా ఉంటే అన్నేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులపైన 18 శాతం సర్‌చార్జీ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ బకాయిల పైన ఎస్‌ఈ కృష్ణయ్య మాట్లాడుతూ...అన్ని శాఖలకు నోటీసులు జారీ చేశామని, ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపేస్తామని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top