పూరి గుడిసెపై రూ.500 పన్నా!  | Rs 500 property tax to the hut At Kumaram Bheem Asifabad district | Sakshi
Sakshi News home page

పూరి గుడిసెపై రూ.500 పన్నా! 

Jun 13 2018 1:56 AM | Updated on Sep 19 2019 8:44 PM

Rs 500 property tax to the hut At Kumaram Bheem Asifabad district - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వృద్ధ దంపతులు నివాసముంటున్న ఓ గుడిసెపై స్థానిక పంచాయతీ కార్యదర్శి రూ.500 ఆస్తి పన్నును వసూలు చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సంఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్లూర్‌ మండలం కర్దెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఉదంతాన్ని ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. బాధితులు చెల్లించిన ఆస్తి పన్నును వెనక్కి ఇప్పించడంతో పాటు వారికి డబుల్‌బెడ్‌ రూం ఇంటిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక అధికారులు నిర్దయగా వ్యవహరించారని ఉత్తమ్‌ తప్పుపట్టారు. దీనికి కేటీఆర్‌ స్పందించి ఈ పొరపాటును సరిదిద్దాలని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఆ దంపతులకు డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని మంజూరు చేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్‌ రాని పక్షంలో అదీ మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఉత్తమ్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ ఆదేశాలపై కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ ప్రశాంత్‌ జీవన్‌ ట్వీటర్‌లో స్పందించారు. ఈ విషయం తన దృష్టికి నాలుగు రోజుల క్రితమే వచ్చిందని.. వెంటనే బాధితులకు ఆస్తిపన్ను తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. ఆ వృద్ధ దంపతులకు ఇప్పటికే ఆసరా పింఛన్‌ అందుతోందని.. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద ఇంటిని మంజూరు చేస్తామని కేటీఆర్‌కు ఆయన బదులిచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement