రాష్ట్రంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు

Rs 12,500 crore investments in the state - Sakshi

రాష్ట్ర ప్రభుత్వంతో బిన్‌ జాయెద్‌ గ్రూప్‌ ఒప్పందం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణంలో రూ.12,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన ప్రముఖ కంపెనీ బిన్‌ జాయెద్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం బిన్‌ జాయెద్‌ గ్రూప్‌ చైర్మన్‌ షేక్‌ ఖాలెద్‌ బిన్‌ జాయెద్‌ అలీతో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, మూడేళ్లలో సాధించిన అభివృద్ధి, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను తెలుసుకుని ఆకర్షితులైన షేక్‌ ఖాలెద్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ గ్రూపు సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ సాధించిన ప్రగతి, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ఖాలెద్‌ను అరవింద్‌ కుమార్‌ ఆహ్వానించారు. ఒప్పందం మేరకు బిన్‌ జాయెద్‌ గ్రూప్‌ రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, హైదరాబాద్‌లో నిర్మించనున్న గేమ్, యానిమేషన్‌ టవర్, మూసీ రివర్‌ డెవ లప్‌మెంట్‌ ఫ్రంట్, మిషన్‌ భగీరథ, తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ వంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తుంది. త్వరలోనే తెలంగాణకు ఒక ఉన్నతస్థాయి బృందాన్ని పంపేందుకు ఈ సంస్థ అంగీకరించింది.

సదస్సులో ఆకట్టుకున్న తెలంగాణ
దుబాయ్‌లో జరుగుతున్న రెండు రోజుల ఇండియా–యూఏఈ భాగస్వామ్య సదస్సుకు హాజరైన పలువురు పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం ఆకట్టుకుందని పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సదస్సులో భాగస్వామ్య రాష్ట్రంగా హాజరైన తెలంగాణ ప్రతినిధి బృందం.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ఇచ్చిన ప్రజెంటేషన్‌ పలువురిని ఆకట్టుకుందని తెలిపింది.

భారత్‌లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్లలో సాధించిన ప్రగతిని అరవింద్‌ కుమార్‌ తన ప్రజెంటేషన్‌లో వివరించారని పేర్కొంది. తెలంగాణ ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారని, ప్రధానంగా ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, ఏరోస్పేస్, ఐటీ, టెక్స్‌టైల్స్‌ వంటి 14 రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారని చెప్పింది. ఆయా రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలతోపాటు రాష్ట్రంలో నూతన పరిశ్రమలకు అందుబాటులో ఉన్న లాండ్‌ బ్యాంక్, విద్యుత్‌ వంటి సౌకర్యాలను వివరించారని, ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ, టెక్స్‌టైల్‌ పార్క్, మెడికల్‌ డివైజస్‌ పార్కులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారని వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top