
‘ముంపు’ గోడు పట్టని కేసీఆర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తిగా విఫలమయ్యారని, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని ప్రజల సమస్యలను విస్మరించారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాల్సిందే: ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పూర్తిగా విఫలమయ్యారని, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లోని ప్రజల సమస్యలను విస్మరించారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు విమర్శించారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ సామాజిక న్యాయ ప్రజాస్వామిక ఫ్రంట్ ఆధ్వర్యంలో ‘పోలవరం ముంపు గ్రామాలు -హైదరాబాద్ నగరంలో గవర్నర్ పాలన, విప్లవ సంస్థలపై నిషేధం’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ చల్లబడి పోయారని విమర్శించారు.
ముంపు గ్రామాల ప్రజల అభిప్రాయాలు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దుర్మార్గమన్నారు. ఈ విషయంపై ముఖ్య మంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాక 175 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వంలో గవర్నర్‌కు అత్యధిక అధికారాలు ఇవ్వడం అన్యాయమన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామిక హక్కుల్ని కాల రాయడం హేయమైన చర్య అని అన్నారు.
ప్రజాసంఘాలు, మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని గులాబీ ప్రభుత్వం ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎం.ధర్మారావు మాట్లాడుతూ ఆది వాసీలను ముంచే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఉద్యమాలు చేపట్టాలన్నారు. హైకోర్టు అడ్వొకేట్ కె.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్‌టేబుల్ సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సూర్యం, సీపీఐ నాయకులు ఎన్.జ్యోతి, మాజీ ఎంపీ ఆర్.రాంచంద్రయ్య, తెలంగాణ ప్రజా సమితి ప్రధాన కార్యదర్శి జి.సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు.