రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు
సీమ ఎత్తిపోతల పనులు వెంటనే చేపట్టాలి
అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
కడప సెవెన్‌రోడ్స్: సీఎం చంద్రబాబు తొలి నుంచీ రాయలసీమ వ్యతిరేకి అని పలువురు నేతలు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్‌సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. రాయలసీమ నీటి అవసరాల దృష్ట్యా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచినపుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు తన పార్టీ నాయకులు దేవినేని ఉమ తదితరులతో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు చేయించారని గుర్తుచేశారు.
వర్షాభావ పరిస్థితుల్లో ఇక్కడి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు వీలుగా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా చంద్రబాబు తెలంగాణలోని తమ పార్టీ నాయకులతో ఎన్‌జీటీలో ఫిర్యాదు చేయించారని చెప్పారు. సీమపై బాబుకు ఉన్న వ్యతిరేకతకు ఇవే నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలం కలిగిస్తున్నాయన్నారు. ముచ్చుమర్రి వద్దే అదనపు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని, సీమ ఎత్తిపోతల పథకం అనవసరమని మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడటం అర్థరహితమని విమర్శించారు. ముచ్చుమర్రి నుంచి నెలరోజులు ఎత్తిపోస్తే ఒక్క టీఎంసీ నీళ్లు మాత్రమే వస్తాయని చెప్పారు. వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. సీమ ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
కృష్ణాలో వరదరోజులు 30కి పడిపోయాయి
ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిలో వరదరోజులు 30కి పడిపోయాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దిండి, పాలమూరు–రంగారెడ్డి వంటి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోందన్నారు. శ్రీశైలంలో నీరు 854 అడుగుల కంటే తగ్గినపుడు తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయకూడదన్నారు. ఈ అంశంపై పోరాటాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ నాయకుడు ఇల్లూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎరువుల ధరలు తగ్గించి అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.


