బీచుపల్లి ఆయిల్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ

Restoration of Beechupalli Oil Factory - Sakshi

చర్యలు ప్రారంభించిన తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌ 

ఎన్‌డీడీబీకి రూ. 5 కోట్లు చెల్లించి వెనక్కు తీసుకోవాలని నిర్ణయం

చంద్రబాబు హయాంలో 2003లో మూసివేత

సాక్షి, హైదరాబాద్‌: గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్‌ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దీంతో 16 ఏళ్ల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ మళ్లీ జీవం పోసుకోనుంది. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని మూసి వేయగా, ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుండటంతో ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ. 11.26 కోట్లతో నిర్మించారు.

వేరుశనగ నూనె, కేక్‌ ఆయిల్‌ తయారు చేసేవారు. దాన్ని జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ) ఆర్థిక సహకారంతో నిర్మించారు. అయితే అది మూతపడినా ఎన్‌డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయితే ఇప్పుడు దాన్ని తెరవాలంటే ఎన్‌డీడీబీకి తీసుకున్న అప్పును చెల్లించాల్సి ఉంది. ఒకేసారి చెల్లించేలా (వన్‌టైం సెటిల్‌మెంట్‌) ఎన్‌డీడీబీతో ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. అయితే ఎన్‌డీడీబీ రూ. 7.5 కోట్లు కావాలని కోరుతుండగా, ఆయిల్‌ఫెడ్‌ మాత్రం రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లతోనే సెటిల్‌ చేసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్‌ ఎండీ నిర్మల, సీనియర్‌ మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి మంగళవారం ఎన్‌డీడీబీ అధికారులతో సమావేశమయ్యారు.  

రోజుకు 200 మెట్రిక్‌ టన్నుల నూనె 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వేరుశనగ సాగుచేసే రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం, రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే వేరుశనగ నూనె అందించడం కోసం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. వివిధ రకాల అడ్డంకులు అధిగమించి  1990లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 135 మంది ఉద్యోగులు పనిచేశారు. రోజుకు 200 మెట్రిక్‌ టన్నుల వేరుశనగ నూనెసహా ఇతరత్రా నూనెలనూ ఉత్పత్తి చేసేవారు. ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నప్పటికీ సంస్కరణల పేరుతో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. దాన్ని అక్రమంగా మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి.

అనేకమంది కార్మికులను తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి వీఆర్‌ఎస్‌ ఇచ్చి తీసేశారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడంపై అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఫ్యాక్టరీని తెరిచాక మళ్లీ వేరుశనగ నూనెతో పాటు పామాయిల్, ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడు స్తుందని అంటున్నారు. అందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top