రీషెడ్యూల్ చేస్తేనే రుణమాఫీ | Sakshi
Sakshi News home page

రీషెడ్యూల్ చేస్తేనే రుణమాఫీ

Published Fri, Jan 30 2015 10:50 AM

reschedule  compulsary for loan waiver

కరీంనగర్ అగ్రికల్చర్: సర్కారు నిర్ణయాలు కరీంనగర్ జిల్లా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇచ్చినట్లే ఇచ్చి ఎంతో కొంత తిరిగి రాబట్టుకునేందుకు కొర్రీలు పెడుతోంది. ఈ నెలాఖరులోగా రీషెడ్యూల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందంటూ సర్కారు స్పష్టం చేసింది. అన్నదాతలకు అవగాహన లేక, రీషెడ్యూల్ ప్రక్రియ విధానం తెలియక కరీంనగర్ జిల్లాలో 70వేల మంది అందుకు దూరంగానే ఉన్నారు. వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు కనీస చర్యలకు పూనుకోకపోవడంతో వీరందరికి రుణామాఫీ ప్రశ్నార్థకంగా మారుతోంది. డెడ్‌లైన్ గడువు మరో 48 గంటలే ఉండడంతో రైతులందరికీ రీషెడ్యూల్ జరుగుతుందా అనేది అనుమానంగా ఉంది.

టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఆగస్టులో పంట రుణాల మాఫీని ప్రకటించింది. జిల్లాలో రూ.లక్ష లోపు రుణం పొందిన 3,80,203 మంది రైతులను గుర్తించగా, వీరికి రూ.1694 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తామని పేర్కొంది. అయితే ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి విడతగా 25 శాతం అంటే రూ.423.56 కోట్ల రుణమాఫీని రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే సర్కారు తీరుతో విడుదలైన 25శాతం సొమ్ము కూడా రైతులకు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. రుణమాఫీ వర్తించాలంటే రీషెడ్యూల్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేస్తుండడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.

కరీంనగర్ జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో పంట రుణాల లక్ష్యం రూ.2300 కోట్లకు కాగా, ఇప్పటివరకు రూ.1600 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. రుణమాఫీ అర్హత పొందిన 3,80,203 మంది రైతుల్లో  3,10,000 మంది మాత్రమే రీషెడ్యూల్ చేసుకున్నారు. పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుని రుణమాఫీ అర్హత ఉన్నవారంతా రీషెడ్యూల్‌లో భాగంగా రూ.1560 కోట్ల పంట రుణాలు పొందినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో 70,203 మంది రైతులు ఈ ఏడాది పంట రుణాలు తీసుకోలేదు. ప్రభుత్వం మాత్రం వారిని రుణమాఫీకి అర్హులుగా గుర్తించి వారి బ్యాంకు ఖాతాల్లో 25శాతం సొమ్మును జమచేసింది.

గడువు రెండు రోజులే..
రైతులకు రుణమాఫీ వర్తించాలంటే రుణాలు రీషెడ్యూల్ చేసుకుని బ్యాంకర్లు ఇచ్చే మొత్తాన్ని తీసుకోవాలి. అప్పుడే 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాల్లో మిగిలిన రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు వేసిన మొత్తానికి అనుగుణంగా మళ్లీ రుణాలు పొందలేకపోతే ప్రభుత్వం ఈ మొత్తాన్ని వెనక్కు తీసుకుంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పుడు రుణం మొత్తాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈనెల 31లోగా రైతులంతా రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉండగా, వ్యవసాయశాఖ, బ్యాంకర్లు చివరి నిమిషంలో హడావుడి చేయడం విమర్శలకు తావిస్తోంది.

బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మధ్య సమన్వయలోపం కారణంగా 70వేల మంది రీషెడ్యూల్ చేసుకోలేకపోయారు. వీరిలో భూమి తన పేరు మీద ఉండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు, చాలా కాలంగా రుణాలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉండి చనిపోయినవారు, అర్హత కార్డులు లేని కౌలురైతులే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో అధికారులు వ్యవసాయం చేసుకుంటున్న వారి సంబంధీకులకు వారికి ఉన్న భూమి ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణం ఇచ్చే చర్యలకు పూనుకుంటున్నారు. ఈ విషయమై లీడ్ బ్యాంకు మేనేజర్ డీఏ.చౌదరి మాట్లాడుతూ ఈనెల 31లోగా పంట రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని, వందశాతం రీషెడ్యూల్ జరిగేలా బ్యాంకర్లకు ఆదేశాలున్నాయని, ఈ రెండు రోజుల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement