ఆర్థిక స్థితిగతులపై నివేదికలివ్వండి

Report on financial situation - Sakshi

దక్షిణాది రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాలన్నీ తమ ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని ఏప్రిల్‌ 15లోగా పంపించాలని దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక సంఘం ఆదేశించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా 15వ ఆర్థి క సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చారు. శుక్రవారం వారు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆర్థిక సంఘం కార్యదర్శి అర్వింద్‌ మెహతా, ఆయన సతీమణితో సహా ఇతర అధికారులు ఈ బృందంలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి శివశంకర్, సలహాదారు జీఆర్‌ రెడ్డి, పంచాయతీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 
సంఘం సూచనల మేరకే నిధులు..: 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆర్థిక స్థితిగతులు, కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, పన్నుల వాటా, స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లు, తదితర నిధుల పంపిణీ అంశాలను అధ్యయనం చేస్తోంది. కాగా, రాష్ట్ర పర్యటనలో భాగంగా సంఘం ప్రతినిధులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top