తెలంగాణలో 15 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.
900 మంది ఎస్‌ఐల నియామకానికీ చర్యలు
గజ్వేల్: తెలంగాణలో 15 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో యువతీ, యువకులకు జరుగుతున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కానిస్టేబుల్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని, ఇందులో భాగంగా 9 వేల పోస్టులకు నోటిఫికేషన్ సిద్దం కాగా, మరో 6 వేల పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. 900 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సైతం నోటిఫికేషన్ త్వరలో రానున్నదని వెల్లడించారు.
మున్నెన్నడూలేని విధంగా ఈ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తన సొంత నియోజకవర్గానికి చెందిన యువతీ, యువకులు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగం పొందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌లో శిక్షణ తరగతుల నిర్వహణకు సూచనలు చేశారని, శిక్షణ కోసం రూ.37లక్షల నిధులు కేటాయించారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.