22% ఓట్ల తొలగింపు

Removal of 22% votes to be removed from voters list : EC survey - Sakshi

1.09 కోట్ల ఓట్లలో 24 లక్షల ఓట్లు తొలగింపు

29.93 లక్షల ఓట్లు వేరే చిరునామాకు బదిలీ

తుది ముసాయిదాలోని ఓట్లు.. 91.06 లక్షలు

36 అసెంబ్లీ స్థానాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా సర్వే..

జనవరి 20న తుది ఓటరు జాబితా

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఇంటింటికీ సర్వే జరిపి ఓటరు జాబితాల సవరణ జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనూప్‌ సింగ్‌ తెలిపారు. 36 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,09,44,968 ఓట్లు ఉండగా ఇంటింటికీ సర్వే జరిపి పలు కారణాలతో 24,20,244 (22.11శాతం) ఓట్లు తొలగించినట్లు వెల్లడించారు. మరో 29,93,777 (27.35 శాతం) ఓటర్లు వేరే చిరునామాలకు తమ ఓట్లను బదిలీ చేసుకున్నారని చెప్పారు. సర్వే తర్వాత 55,30,947 (50.53 శాతం) ఓట్లు ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయన్నారు. కొత్తగా 5,82,138 (6.4 శాతం) నమోదు చేసుకున్నారని తేలినట్లు వివరించారు. ఇంటింటి సర్వే ముగిశాక మొత్తం 91,06,862 ఓట్లు మిగిలినట్లు చెప్పారు. ఓటరు జాబితా సవరణపై మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొం దించిన వెబ్‌ ఆధారిత అప్లికేషన్‌ ద్వారా ఓటరు జాబితాల సవరణ చేపట్టినట్లు తెలిపారు. సర్వే అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను గత నెల 27న ప్రచురించినట్లు చెప్పారు.

ఈ జాబితాను www.ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని సింగ్‌ చెప్పారు. దీనిపై అభ్యంతరాలు, కొత్త ఓట్ల నమోదు, తొలగింపులు, సవరణల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు వచ్చే వారందరూ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. 36 నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను 2018 జనవరి 20న ప్రచురించనున్నట్లు తెలిపారు. సాధారణ సవరణ అనంతరం మిగిలిన నియోవకవర్గాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను ఈ నెల 15న ప్రచురించనున్నట్లు వివరించారు. గతంలో ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పైలట్‌ ప్రాజెక్టు కింద ఓటరు జాబితాల సవరణ నిర్వహించినట్లు గుర్తు చేశారు.

సర్వే జరిగింది ఈ స్థానాల్లోనే..
ఆదిలాబాద్, కరీంగనర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, మలక్‌పేట, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పూర, సికింద్రాబాద్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, మహబూబ్‌నగర్, నల్లగొండ, స్టేషన్‌ ఘన్‌పూర్, పరకాల, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, ఖమ్మం, పాలేరు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top