
రిజిస్ట్రేషన్ శాఖలో కుంభకోణం
రిజిస్ట్రేషన్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఫోర్జరీ, బోగస్ చలాన్లతో కొందరు ప్రభు త్వ ఆదాయానికి గండి కొట్టారు. మూడు నెలల్లోనే దాదాపు రూ.9 లక్షలు కాజేశారు.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : రిజిస్ట్రేషన్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఫోర్జరీ, బోగస్ చలాన్లతో కొందరు ప్రభు త్వ ఆదాయానికి గండి కొట్టారు. మూడు నెలల్లోనే దాదాపు రూ.9 లక్షలు కాజేశారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని.. ఇది రూ.కోటిపై కుంభకోణం జరిగి ఉంటుంది. స్థిరాస్తి, భూ కొనుగోలుదారుల్లో ఈ వ్యవహారం గుబులు పెట్టిస్తోంది. భూములు కొనాలనుకునే వారు ఈ సంఘటన నేపథ్యంలో భయాందోళనలకు గురవుతున్నారు.
నిర్మల్‌లో బయటపడ్డ ఈ వ్యవహారం మిగతా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కూడా చోటు చేసుకొని ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిర్మల్ కార్యాలయంలో ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన సోదరునితో కలిసి ఈ బాగోతానికి పాల్పడ్డట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారితోపాటు ఇతరులకు ఈ వ్యవహారంలో హస్తం ఉందని శాఖలో చర్చసాగుతోంది.
ఫోర్జరీ, బోగస్ చలాన్లు
నిర్మల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తన సోదరునితోపాటు ఇతరులతో కలిసి అక్రమ బాగోతం నడిపాడని అనుమానాలున్నాయి. ఆ ఉద్యోగిని అధికారులు అతిగా నమ్మడంతోనే ఈ వ్యవహారం కొన్నేళ్లుగా సాగుతున్నా బయటకు రానట్లు సమాచారం. ఇందులో అధికారుల నిర్లక్ష్యం కూడా కనబడుతోంది.
ఓ పార్టీ స్థిరాస్తి, భూమి కొనుగోలు చేయాలంటే బ్రోకర్లను సంప్రదిస్తారు. పార్టీల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ ఫీజును వసూలు చేసి బ్యాంక్ చలాన్ తీయడం ద్వారా ఆ సొమ్ము సర్కార్ ఖజానాకు చేరుతోంది. చలాన్‌లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పత్రాలకు జతచేసి దాని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతోంది. బ్యాంకులో చలాన్ తీసినప్పుడు మూడు స్క్రాల్‌లు జారీ జేస్తారు.
అందులో ఒకటి పార్టీకి, మరొకటి రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేస్తారు. ఇంకొకటి బ్యాంకులో ఉంటుంది. బ్రోకర్లు రిజిస్ట్రేషన్ సమయంలో బీజీ బీజీగా ఉంటారు. దీంతో అందరు కలిసి ఎవరైన ఒకరితో రోజు చలాన్లు తీయిస్తుంటారు. ఈ అవకాశాన్నే సదరు ఔట్‌సోర్సీంగ్ ఉద్యోగి తనకు అనుకూలంగా మలుచుకొని వ్యవహరం నడిపాడని అంటున్నారు.
అతని సోదరునితో చలాన్లు తీయిస్తూ ఈ అక్రమ బాగోతానికి తెరలేపాడు. చలాన్ తీయాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో తీసీ పార్టీలకు ఇచ్చే స్క్రాల్‌లో ఫోర్జరీ చేసి దాని ఎక్కువ మొత్తానికి మార్చేవారు. ఉదాహరణకు రూ.15,500 చలాన్ తీయాల్సి ఉంటే రూ.5,500 చలాన్ తీసీ దానిపై ఫోర్జరీ చేసి రూ.15,500 గా మార్చేవారు.
కొన్నిసార్లు పార్టీల నుంచి డబ్బులు తీసుకొని అసలుకే చలాన్ తీయకుండా రబ్బర్ స్టాంప్‌లతో ముద్రలు, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ చలాన్‌లను సృష్టించి వ్యవహరం సాఫీగా నడిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే స్క్రాల్‌ను సూక్ష్మంగా పరిశీలిస్తే.. చలన్ మొత్తం, ట్రెజరీలో జమ అయ్యే దానిని సరిపోల్చుకుంటే వ్యవహరం ఎప్పుడో బయటపడేది. అధికారులు నిర్లక్ష్యం చేయడంతో కొన్నేళ్లుగా వ్యవహరం సాగుతోంది.
ఇటీవల ఓ బాధితుడు అనుమానమొచ్చి జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో బయటకొచ్చింది. జిల్లాలోని ఇతర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇలాంటివి జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మంచిర్యాలలో త్వరలో పరీశీలన జరపనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కరీంనగర్ డీఐజీ నాయుడుని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.
ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చే నివేదిక ఆధారంగా దానిపై విచారణ బృందాన్ని నియమించి పూర్తిస్థాయిలో పరిశీలన జరపనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రిజిస్ట్రార్ రమణరావును వివరణ కోరగా నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిర్మల్ పట్టణ సీఐ ప్రశాంత్ రెడ్డిని వివరణ కోరగా, సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా బాధితులపై కేసు నమోదు చేసి వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. వారు ఎవరికి డబ్బులిచ్చారో, చలాన్ ఎవరు తీశారో అనే విషయాలను బాధితుల నుంచి రాబడుతున్నామని తెలిపారు. తద్వారా అసలు నిందితులను పట్టుకుంటామని వివరించారు.