ఒకటి నుంచే రబీ సాగు | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచే రబీ సాగు

Published Thu, Sep 29 2016 2:46 AM

ఒకటి నుంచే రబీ సాగు - Sakshi

గడువు తేదీలతో వ్యవసాయ కేలండర్

 సాక్షి, హైదరాబాద్ : రబీ పంటలసాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల మేరకు చర్యలు తీసుకునేందుకు సమామత్తమైంది. నేలలను బట్టి సాగు చేయాల్సిన పంటల వివరాలను వెల్లడించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే వివిధ రకాల పంటల సాగు మొదలుపెట్టాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. 2016-17 రబీ కేలండర్‌ను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించారు.

దీన్ని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి బుధవారం అందజేశారు. రబీ సీజన్ లో పంటలు వేయాల్సిన గడవు తేదీలను వారు ప్రకటించారు. దాని ప్రకారం వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటలను వచ్చేనెల ఒకటోతేదీ నుంచే వేయడం ప్రారం భించాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పంటలను వచ్చే నెల 20వ తేదీ వరకు వేసుకోవచ్చని, దక్షిణ తెలంగాణలో వేరుశనగను మాత్రం నవంబర్ 15 వరకు వేసుకోవచ్చని వెల్లడించారు.

శనగ, మొక్కజొన్న పంటలను అన్ని జిల్లాల్లోనూ నవంబర్ 15 వరకు వేసుకోవడానికి అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రకటించారు. నవంబర్ 15 తేదీ తర్వాతే స్వల్పకాల వ్యవధి గల వెరైటీ వరి నారు మాత్రమే పోయాలని స్పష్టం చేశారు. ఇలా చేస్తే ఆశించినంత దిగుబడి వస్తుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ రాజిరెడ్డి తన నివేదికలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో తేలికపాటి భూముల్లో వేరుశనగ, కుసుమ పంటలు, నల్లరేగడి, ఎర్రనేలల్లో పొద్దు తిరుగుడు, కుసుమ, శనగ, కంది పంటలు వేయాలన్నారు.

అదనంగా 10 లక్షల ఎకరాల్లో రబీ సాగు
వర్షాల నేపథ్యంలో రబీ సీజన్‌లో పెద్దఎత్తున పంటలను సాగు చేసేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వాస్తవంగా రబీలో 33.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ ఈసారి అదనంగా మరో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేవాలని, బోర్లు, బావుల కింద కూడా సాగు చేయాలని ఆదేశించారు.

 మూడో వంతు సబ్సిడీపై శనగ, వేరుశనగ విత్తనాలు
వచ్చే రబీకి శనగ, వేరుశనగ విత్తనాలను మూడో వంతు సబ్సిడీకి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement