నిజమైన నాయకుడు... | Real Leader | Sakshi
Sakshi News home page

నిజమైన నాయకుడు...

Nov 8 2018 7:17 PM | Updated on Nov 8 2018 8:30 PM

Real Leader - Sakshi

సాక్షి, భద్రాచలం : ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరతరాలకు సరిపడేంత వెనుకేసుకునే ప్రస్తుత రాజకీయాల్లో.. సంపాదన​కు దూరంగా, విలువలే పరమావధిగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజాసమస్యలపై విశేషంగా గళమెత్తారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తున్న కుంజా బొజ్జి..వృద్ధాప్యంలోనూ ప్రస్తుత ఎన్నికల్లో జొరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ హ్యాట్రిక్‌ ఎమ్యెల్యే ఇప్పటికీ సాధరణ జీవితాన్ని గడుపుతున్నారు.

గ్రామంలో జన్మించి..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వీఆర్‌పురం మండలం రామవరం పంచాయితీలోని అడవి వెంకన్న గూడెంలో కుంజా బొజ్జి జన్మించారు. నిరుపేద కుటుంబంలో 8వ సంతానంగా జన్మించిన ఆయన కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పెద్దగా చదువుకోలేదు. 1948లో లాలమ్మను వివాహం చేసుకున్న ఆయనకు ఆరుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.

ఓటమి విజయానికి నాందిగా భావించి..
1970లో వీఆర్‌పురం మండలంలోని రామవరం పంచాయితీ సర్పంచ్‌గా పోటీ చేసిన ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయారు. 1981లో వీఆర్‌పురం సమితి అధ్యక్షుడిగా సీపీఎం నుంచి పోటిచేసిన ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. కానీ ప్రతీ ఓటమిని ఓ గుణపాఠంగా తీసుకొని ప్రజా సమ​స్యల పరిష్కారంలో ముందుండే వారు. 

నక్సలైట్ల చేతిలో దెబ్బలు తిని..
మొదటి నుంచి కమ్యూనిస్లు పార్టీలో చురుకుగా పాల్గొన్న ఆయన 1985లో జీడిగుప్పలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీపీఎం నేతలు బత్తుల భీష్మారావు, బండారు చందర్‌రావులతో కలసి వెళ్లారు, వీరు వస్తున్న సమాచారం అందుకున్న మావోయిస్టులు చుట్టుముట్టి బత్తుల భీష్మారావు, చందర్‌రావులను కాల్చి చంపారు. బొజ్జిని మాత్రం కొట్టి వదిలివేశారు.

పార్టీ గెలుపు కోసం..
సీపీఎం పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా 92ఏళ్ల ముదిమి వయుస్సులో కూడా యువకుడిలా చురుకుగా పాల్గొనడం పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప‍్రస్తుతం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా డాక్టర్‌ మిడియం బాబూరావు బరిలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ గెలవాలనే ఆకాంక్షతో ప్రచారంలో పాల్గొంటున్నారు. కుంజా బొజ్జిని ఆదర్శంగా పార్టీ కా​ర్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.

హ్యాట్రిక్‌ వీరుడు 
భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా 1985లో మొదటిసారిగా పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 1989,94ల్లో కూడా సీపీఎం నుంచి గెలుపొందారు. 1984లో ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం రూ.2వేలు. అందులో రూ.వెయ్యి రా​ష్ట్ర పార్టీకి ,రూ.200 జిల్లా ఫండ్‌గా ఇచ్చి మిగిలిన రూ.800లతో కుటుంబాన్ని సాకేవారు. ఆనాడు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించగా పార్టీ నిర్ణయం మేరకు ఆ స్థలాన్ని  కూడా నిరాకరించిన నిజాయితి పరుడు కుంజా బొజ్జి.

రాజకీయాలు మారాలి
పేదలకోసం పనిచేసే రాజకీయ నాయకులు కావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు చాలా తక్కువగా కనిస్తున్నారు. ఒక్క సారి గెలిస్తే ఎంత సంపాదిద్దామా అనే ధోరణితోనే ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తరాలు మారినా మనం చేసిన సేవలు జనం గుర్తించుకోవాలి .రాజకీయాల్లో విలువలను పాటించాలి. లేకుంటే బతికున్నా చచ్చినట్టే, తన శేష జీవితం కూడా పార్టీ  కోసమని ,ప్రజల కోసమే వెచ్చిస్తా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి.

మెజారిటీలోనూ ఆయనదే రికార్డు 
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారిలోకెల్లా అత్యధిక మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన ఘనత కూడా కుంజా బొజ్జికే దక్కుతుంది. 1985,89,94 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు సీపీఎం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 1994లో 39,265 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు 1955 నుంచి 2014 ఎన్నికల వరకూ గెలిచిన అభ్యర్థుల్లో మరెవ్వరికీ ఈ స్థాయిలో మెజారిటీ రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement