
సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం పౌరసరఫరాల శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం వేలిముద్రల ఆధారంగా రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న రేషన్‌షాపుల్లో ఈ–పాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీ ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 72 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, సూపర్‌వైజర్ల ఆధార్‌తోపాటు వేలిముద్రలను ఈ–పాస్ మెషీన్లకు నేషనల్ ఇన్‌ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సహకారంతో అనుసంధానం చేసింది.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో శుక్రవారం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో బియ్యం సరఫరా ప్రక్రి య, అంగన్‌వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర బోయి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని అకున్ సభర్వాల్ సూచించారు. కాగా, రేషన్‌షాపుల ద్వారా వేలిముద్రలతో బియ్యం సరఫరాతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.