ఎలుకలే వారికి జీవనాధారం

Rat Catchers In Medak  - Sakshi

పంటలను నాశనం చేసే ఎలుకల పట్టివేతే వృత్తి

ప్రభుత్వం ఆదుకోవాలంటున్న నిరుపేదలు

మెదక్‌రూరల్‌ : కాలంతో పోటీ పడలేక.. అనేక మంది కులవృత్తులనే నమ్ముకుంటున్నారు. పొద్దంతా కష్టపడినా మూడు పూటలా తిండి దొరకక కాలం వెళ్లదీస్తున్నారు. పంటలను నాశనం చేసే ఎలుకలను పట్టుకొని జీవనోపాధి పొందుతున్న వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..వరి పంటలను నాశనం చేసే ఎలుకలను పట్టుకోవడమే వారి వృత్తి. తాతల కాలంగా కులవృత్తిగా మార్చుకొని జీవనోపాధి పొందుతున్నారు.

కట్టెలతో తయారు చేసిన బుట్టల్లో ఎలుక పడితేనే బుక్కెడు బువ్వ దొరుకుతుందని వృత్తిదారులు వాపోతున్నారు. పొద్దున లేచింది మొదలు బతుకుదెరువు వెత్తుక్కుంటూ పొలాల గట్ల వెంబడి తిరగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వెదురుతో బుట్టలు తయారు చేసి.. రైతుల పిలిస్తే వారి పొలాలకు వెళ్లి.. అక్కడి పొలం గట్లలో ఉండే ఎరుకలను బంధిస్తుంటారు.

ఇలా ఒక్కో ఎలుకను పట్టుకున్నందుకు రూ.10 వసూలు చేస్తారు. రోజుకు సుమారు 50 నుంచి 80 ఎలుకలు బుట్టల్లో పడతాయని చెబుతున్నారు. కులవృత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టుగానే తమను ఆదుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎలుకని పడితేనే పూట గడుస్తది

వరి పంటలను నాశనం చేసేఎలుకలను బుట్టల్లో బంధిస్తుంటాం. ఒక్కో ఎలుకకు రూ.10 చొప్పున తీసుకుంటాం. బుట్టలో ఎలుక పడితేనే పూట గడుస్తది. దీంతో పొద్దంతా పొలాల గట్ల వెంబడి తిరిగాల్సిందే. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. పొద్దంతా కష్టం చేసినా కుటుంబ పోషణ భారంగానే ఉంటుంది.    

 – గిరిబాబు, మాచవరం, మెదక్‌ మండలం

ప్రభుత్వం ఆదుకోవాలి

తాతల కాలం నుంచి ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నాం. మేము ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరించాలి. రైతులు ఫోన్‌ చేస్తే వెళ్లి పొలాల్లో ఉండే ఎలుకలను పట్టుకుంటాం. రోజుకు దాదాపు 70 ఎలుకలు బట్టులో పడతాయి. ఒక్కోసారి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. 

  – ఫణీంద్ర, మాచవరం, మెదక్‌ మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top