
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనదేశంలో అంతరించే ప్రమాదమున్న రాబందు జాతికి చెందిన గద్ద పిల్ల హైదరాబాద్‌లో అటవీ అధికారులకు దొరికింది. దాదాపు ఇరవై ఏళ్ల కిందట ఇక్కడి వనస్థలిపురంలో కనిపించిన ఈ జాతి రాబందు.. తర్వాత కాలంలో కనిపించకుండా పోయింది. దేశంలోనే అరుదైన రాబందు జాతికి చెందినదిగా (వైట్ బ్యాక్డ్ వల్చర్) భావిస్తున్న ఈ జాతికి సంబంధించిన రాబందు పిల్ల దొరకడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ పక్షి ఇక్కడి ఆసిఫ్‌నగర్‌లో తమకు కనిపించిందంటూ అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన అటవీశాఖ హెల్ప్‌లైన్‌కు శుక్రవారం రాత్రి ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో స్పందించిన యాంటీ పోచింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకుని మహ్మద్ అబ్దుల్ నయీం, మహ్మద్ అబ్దుల్ అజీమ్‌ల నుంచి ఈ పక్షి పిల్లను తీసుకున్నారు.
అనంతరం దాన్ని నెహ్రూ జూలాజికల్ పార్కులోని వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన ఎండల కారణంగా నీరు దొరకక పక్షి నీరసించిపోయినట్లు గుర్తించారు. జూలో ఎలక్ట్రాల్ పౌడర్‌తో కూడిన నీటిని అందించడంతో శనివారం ఉదయం కల్లా కొంత తేరుకుందని, చిన్న చిన్న మాంసం ముక్కలను తినడం మొదలుపెట్టిందని అధికారులు తెలిపారు. అరుదైన రాబందు జాతికి చెందిన ఈ పక్షి ప్రస్తుతం జూ అధికారుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. ఈ పక్షి పిల్ల ఎక్కడి నుంచి తప్పిపోయి ఇక్కడకు చేరుకుంది, ఇంకా పక్షులకు సంబంధించిన గూళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాన్ని పరిశోధించి, దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్వేషించే చర్యలు చేపట్టినట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఓఎస్డీ శంకరన్ తెలిపారు.