ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

Rare surgery in Government General Hospital - Sakshi

బ్రెయిన్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులు

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు మొదటిసారిగా మెదడుకు శస్త్ర చికిత్స (వైద్య పరిభాషలో క్రేనియాటమీ) చేశారు. హైదరాబాద్‌ మినహా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్‌కు శస్త్ర చికిత్స జరగడం తెలంగాణలో ఇదే తొలిసారి అని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు గురువారం విలేకరులకు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన రజనీకాంత్‌ నవంబర్‌ 30న ఎల్లారెడ్డిలో బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు.

క్షతగాత్రుడిని నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా న్యూరో సర్జన్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి పరీక్షించారు. సిటీస్కాన్‌ తీయగా తలకు గాయమవడంతో బ్రెయిన్‌లోకి గాలి, చిన్నచిన్న ఇసుక రాళ్లు చొచ్చుకు పోయినట్లు గుర్తించారు. తక్షణమే ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల 2న రజనీకాంత్‌కు ఆస్పత్రిలో వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ చేశారు. కాగా, ప్రస్తుతం రజనీకాంత్‌ ఆరోగ్యంగా ఉన్నాడు.

మరో రెండు, మూడు రోజుల్లో ఇంటికి పంపించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే శస్త్ర చికిత్స ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగితే రూ.3 లక్షల వరకు ఖర్చు అయ్యేదని వైద్యులు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో మత్తు మందు వైద్యుడు గిరిధర్, డాక్టర్లు విశాల్, తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రాములు అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top