ర్యాపిడ్ యాక్షన్


సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో కరెంటు నిరసన సెగలు భగ్గుమన్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉరుకులు పరుగుల మీద జిల్లా యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. విస్తృతమైన తనిఖీలు, పరిశీలనలు, సమీక్షలు, సమావేశాలతో ఇటు విద్యుత్, అటు రెవిన్యూ అధికారులను హడలెత్తించారు. మొత్తానికి  కరెంటు కోతలు ఉన్నప్పటికీ అందుబాటులో కరెంటుతోనే బోరు మోటార్లలోని నీళ్లను నారు మళ్లలోకి పారించి, నిరసన సెగలను చల్లార్చారు.



 సోమవారం చేగుంట మండలం నార్సింగి వద్ద  44 నంబర్ జాతీయ రహదారిపై విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టగా, వారిపై పోలీసులు లాఠీచార్జి చేసిన నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ విద్యుత్  , రెవిన్యూ అధికారులను పరుగులు పెట్టించారు. తీవ్రమైన కరెంటు కోతల నేపథ్యంలో రైతు ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుందేమోనని భయపడిన ప్రభుత్వానికి శరత్ ‘ర్యాపిడ్ యాక్షన్’ తారకమంత్రంగా పని చేసింది. మంగళవారం రైతులకు కొంతవరకు  కరెంటు అందుబాటులో ఉండటంతో వారు కొద్దిగా శాంతించారు.



సోమవారం రాత్రికి రాత్రే జిల్లాలో విద్యుత్ సరఫరా, వినియోగం వివరాలను శరత్ తెప్పించుకున్నారు. జిల్లాకు విద్యుత్ కేటాయింపులు, అందులో పరిశ్రమల వినియోగమెంత?  వ్యవసాయానికి ఏ మేరకు వాడుకుంటున్నారు, గృహ అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు..?   తదితర వివరాలు తెప్పించుకున్న ఆయన  పక్కా ప్రణాళికతో మంగళవారం జిల్లా విద్యుత్ అధికారులతో  వీడియోకాన్ఫరెన్స్  నిర్వహించారు. జిల్లాలో డిమాండ్ తగినంత విద్యుత్ సర ఫరా లేకపోయినప్పటీ ఉన్న కరెంటునే ఎలా వాడుకోవాలో అధికారులకు వివరించారు.



 24 గంటలు అందుబాటులో...

 జిల్లాలో మొత్తం 613 ఫీడర్లు ఉన్నాయి. ప్రతి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ ఏఈ, ఏడీఈ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇంజనీర్లు రైతులకు అందుబాటులో ఉండటం లేదని, ఫీడర్లను వదిలేసి వెళ్లిపోవడంతోనే సమస్యలు  వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట  విద్యుత్ ఇంజనీర్లు 24 గంటలు  రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఏఈ, ఏడీఈ ఫోన్ నంబర్లు  ప్రతి  పంచాయతీ, మండల వ్యవసాయ శాఖ, తహశీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 08455272527 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.



 సాగుకిచ్చిన తర్వాతే...

 వ్యవసాయానికి అవసరమైనంత విద్యుత్‌ను సరఫరా చేశాకే, పరిశ్రమలకు ఇవ్వాలని డాక్టర్ శరత్ ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాములును ఆదేశించారు. సమగ్రమైన నిర్వాహణ పద్ధతులు, సమయ పాలన పాటించి విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కాలని సూచించారు. ఇక మీదట ఫీడర్ల నుంచి రైతులకు వెళ్తున్న విద్యుత్ వివరాలను ఎప్పటికప్పుడు తనకు అందించాలని ఆయన ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top