రంగులేస్తారట.. వాటిపై యాడ్స్‌ అతికిస్తారట!  

Railways Plan to write announcements on coaches - Sakshi

రైలు బోగీల విషయంలో వింత వ్యవహారం

ముదురు నీలం రంగును మార్చాలని ఇటీవల రైల్వే నిర్ణయం

తాజాగా బోగీలపై ప్రకటనలు రాయించే ప్రాజెక్టుకు ప్లాన్‌

ప్రకటనల స్టిక్కర్లు అతికిస్తే రంగులేయడం ఎందుకని ప్రశ్న?

రైలు బోగీలకు అందమైన రంగులేస్తారట.. వాటిపై వ్యాపార ప్రకటనల స్టిక్కర్లు అతికిస్తారట.. స్టిక్కర్లు అతికిస్తే రంగులెలా కనిపిస్తాయి? ఇప్పుడు రైల్వేలో జరుగుతున్న వ్యవహారంపై వస్తున్న అనుమానమిది. ఇదేదో చిన్న విషయమైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. రూ.కోట్లలో ఖర్చయ్యే భారీ ప్రాజెక్టు కావటంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే జరిగితే రైల్వేలో చోటుచేసుకోబోతున్న భారీ దుబారా వ్యవహారమే కానుంది.

సాక్షి, హైదరాబాద్‌: రైలు అనగానే.. ముదురు నీలం రంగులో ఉండే బోగీలు స్ఫురణకు వస్తాయి. అంతకుముందు ముదురు ఎరుపు రంగులో ఉండే బోగీలను, 1990లలో ముదురు నీలం రంగులోకి మార్చారు. దశాబ్దంనర దాటి పోవటంతో బోగీల రంగు మార్చాలని ఇటీవల మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ రైల్వే అనగానే.. తక్కువ వేగం, వసతులు అంతగా లేని అపరిశుభ్ర బోగీలు, కుదుపుల ప్రయాణం, మట్టిగొట్టుకుపోయిన స్టేషన్లు అనే అపవాదు ఉండటంతో, దీన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం వేగంగా ప్రయాణించే రైళ్లను ప్రారంభించటంతోపాటు మెరుగైన వసతులు, శుభ్రంగా ఉండే బోగీలను కూడా అందుబాటులోకి తెచ్చారు. స్టేషన్లను కూడా శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ రైల్వే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీనికి తోడు బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి, ప్రధాన నగరాల మధ్య సెమీ బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెడుతున్నారు.

ఇన్ని మార్పులతో రైల్వే శాఖ కొత్త రూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో రైళ్ల రూపు కూడా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం శతాబ్ది, దురంతో, రాజధాని, వందేభారత్‌ లాంటి ప్రీమియర్‌ రైళ్లు మినహా మిగతా రైళ్లకు కొత్త రంగులద్దాలని నిర్ణయించారు. వేగం ఆధారంగా ఆయా కేటగిరీ రైళ్లకు వేర్వేరు రంగులు వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా ఏడెనిమిది డిజైన్లతో కొన్ని బోగీలకు రంగులద్దారు. వీటిని గతేడాది చివర్లో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పరిశీలించి కొన్ని మార్పులు సూచించి దాదాపు ఖరారు చేశారు. ఈలోపు ఎన్నికలు రావటంతో తాత్కాలికంగా దాన్ని నిలిపేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే కొత్త రంగులతో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. 

ఆదాయ పెంపు ఆలోచనతో... 
రైల్వేలో సమూల మార్పుల నేపథ్యంలో భారీగా వ్యయం అవుతుండటంతో ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే బోర్డు తాపత్రయపడుతోంది. ఇందుకోసం సరుకు రవాణాపై దృష్టి పెట్టడంతోపాటు వాణిజ్య పరంగా కొత్త ఆలోచనలకు తెరదీసింది. ఇందులో భాగంగా బోగీలను పెద్ద కంపెనీలకు కాంట్రాక్టుకు ఇవ్వాలని నిర్ణయించింది. కాంట్రాక్టు సమయంలో ఆ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రకటనల స్టిక్కర్లను బోగీలకు అతికించి ప్రచారం చేసుకుంటాయి. గతంలోనే ఈ ప్రయోగం జరిగినా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైళ్లకు ప్రకటనల గిరాకీ బాగా ఉంది. కానీ సాధారణ రైళ్ల విషయంలో అది ఆశించిన స్థాయిలో లేకపోవటంతో దాన్ని పక్కనపెట్టారు. ఇప్పుడు పెద్ద స్థాయిలో దాన్ని చేపట్టి బడా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించారు. 

అలాంటప్పుడు రంగులేయడం ఎందుకు?
బోగీలకు భారీ వ్యయంతో కొత్త రంగులు వేసిన తర్వాత వాటిపై కంపెనీల ప్రకటనల స్టిక్కర్లు అతికిస్తే రంగులు కనిపించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి రంగులేయటం ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇటీవల ఓ సమావేశంలో రైల్వే బోర్డులో కూడా ఇదే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. కానీ కేంద్ర ప్రభుత్వం రంగులేయాల్సిందేనన్న నిర్ణయం తీసుకున్నందున ఇప్పుడు ఈ వ్యవహారం భారీ దుబారాకు దారి తీస్తోందన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రకటనలకు సంబంధించి ఇంకా రైల్వే మంత్రి స్థాయిలో సమీక్షించనందున, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రకటనల రంగులతో బోగీలు కొత్త రూపు సంతరించుకున్నట్టు అనిపిస్తే ఇక రంగులేయాల్సిన అవసరం లేదని, కానీ ప్రకటనలు లేని బోగీలు పాత రంగులతో కనిపిస్తే ఉపయోగం ఏంటని ఆ అధికారి ప్రశ్నించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top