పాఠ్యాంశాలను తెలంగాణీకరిస్తాం | Radical changes in the educational sector | Sakshi
Sakshi News home page

పాఠ్యాంశాలను తెలంగాణీకరిస్తాం

Sep 25 2014 1:42 AM | Updated on Jul 11 2019 5:01 PM

పాఠ్యాంశాలను తెలంగాణీకరిస్తాం - Sakshi

పాఠ్యాంశాలను తెలంగాణీకరిస్తాం

విద్యారంగంలో సమూల మార్పులు చేయాలనే ఆలోచనతో ఉన్నామని, దీనిపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని తెలంగాణ విద్యా మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.

విద్యా రంగంలో సమూల మార్పులు
టీఎస్‌యూటీఎఫ్ విద్యా సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి

 
హైదరాబాద్ : విద్యారంగంలో సమూల మార్పులు చేయాలనే ఆలోచనతో ఉన్నామని, దీనిపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని తెలంగాణ విద్యా మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. రవీంద్రభారతిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాభివృద్ధి - ఉపాధ్యాయుల కర్తవ్యం, విద్యా హక్కు చట్టం అమలు - తీరు తెన్నులపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో ఆంధ్రా వారి ధోరణులున్నాయని, వీటిని పలువురు తన దృష్టికి తెస్తున్నారన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయిలో నిపుణులతో కమిటీ వేస్తామని తెలిపారు. తద్వారా పాఠ్యాంశాలను తెలంగాణీకరణ చేస్తామని చెప్పారు. వివిధ స్థాయిల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఒకేలా అలవెన్స్‌లు ఉండాలనే ఆలోచన న్యాయసమ్మతమేనన్నారు.  ‘విద్యామంత్రిగా పాస్ మార్కులు వచ్చాయని అనుకొంటాను, బాగా పనిచేసి మీ ఆశీర్వాదంతో త్వరలో నోబెల్ ప్రైజ్ అందుకుంటానని’ మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కంకణ బద్ధులు కావాలని సూచించారు. ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ తెలివైన విద్యార్థులను ఉపాధ్యాయ రంగం వైపు ఆకర్షించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తే అది సాధ్యమన్నారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రతి తరగతికి ఒక టీచర్, పిల్లలకు భోజనం, పరిశుద్ధమైన పాఠశాలలు ఇవి రాష్ట్రంలో అమలు కావాలని పేర్కొన్నారు. అందరం కలిసి తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ 1956లో హైదరాబాద్‌లో విద్యా వ్యవస్థకు ఏ స్థితి ఉందో ఇప్పుడు అదే స్థితి తీసుకురావాలన్నారు. తనను ఐఐటీ రామయ్యను చేసింది తెలంగాణ విద్యార్థులేనన్నారు. ఈ కార్యక్రవుంలో ఎమ్మెల్సీ పి. సుధాకర్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. కాగా భోజన విషయంలో నిర్వాహకుల లోపాలపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement