రబీ ప్రణాళిక సిద్ధం

Rabi Season Is Start In Adilabad - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: వ్యవసాయ శాఖ అధికారులు రబీ ప్రణాళిక కోసం యాక్షన్‌ప్లాన్‌ తయారీలో నిమగ్నం అయ్యారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ యేడాది జూన్‌లోనే వర్షాలు పుష్కలంగా కురిసాయి. పంటలకు ఆశాజనకంగా ఉండగా, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రతియేటా అన్నదాతలు ప్రకృతి వైఫరీత్యాలు, దళారుల చేతిలోనూ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దిగుబడులు బాగా వస్తే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల చేతిలో మోసాలకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. గిట్టుబాటు ధరలు లభించే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో    పంటలు నష్టపోవాల్సిన దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
 
యాసంగిపైనే ఆశలు..
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అన్నదాతలు యాసంగిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని 18 మండలాలు ఉన్నాయి. తాంసి మండలంలో మత్తడి ప్రాజెక్టు, జైనథ్‌ మండలంలో సాత్నాల ప్రాజెక్టు మినహా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. రబీలో బోరుబావులపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు. గతంలో అరకొర నీటివనరులు, విద్యుత్‌ సమస్య ఉండేది. ప్రస్తుతం వర్షాలతో చెరువులు, కుంటలు, బావులు నిండి ఉన్నాయి. నీటి సదుపాయం ఉన్న రైతులు ఖరీఫ్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సీజన్‌లో శనగ, వేరుశనగ, మొక్కజొన్న, తదితర పంటలపైనే పెద్ద మొత్తంలో ఆశలు పెట్టుకున్నారు.
 
23వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం అంచనా..
జిల్లాలో ఈ యేడాది రబీలో 23వేల హెక్టార్లలో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 18వేల హెక్టార్లలో శనగ, వెయ్యి హెక్టార్లలో వేరుశనగ, 2వేల హెక్టార్లలో జొన్న, 500 హెక్టార్లలో మొక్కజొన్న, 1500 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. శనగ విత్తనాల ధర క్వింటాలుకు రూ.6,500 ఉండగా, 50 శాతం సబ్సిడీపై రూ.3250కి రైతులకు అందించనున్నారు. మిగతావి కూడా సబ్సిడీపై అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాగా రబీ కోసం ఎరువులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంటున్నారు. యూరియా 9వేల మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4500 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 2300 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 6500 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 250 మెట్రిక్‌ టన్నులు, మొత్తం 23,150 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
24వేల హెక్టార్లలో ఖరీఫ్‌ పంట నష్టం
ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 24వేల హెక్టార్లలో పంటలకు నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పంట చేతికొచ్చే సమయంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పంటలు నష్టపోయి దిగుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని దిగాలు చెందుతున్నారు. జూన్‌ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 780 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా 1142 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని అధికారులు చెబుతున్నారు. ప్రతియేటా ఏదో విధంగా రైతులు నష్టాలను చవిచూస్తూనే ఉన్నారు.  

అందుబాటులో  ఎరువులు, విత్తనాలు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రబీ కోసం ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నాం. అక్టోబర్‌ మొదటి వారం నుంచి సబ్సిడీ విత్తనాల కూపన్లను క్లస్టర్ల వారీగా పంపిణీ చేయనున్నాం. గతంలో విత్తనాలు 33శాతం సబ్సిడీ అందించగా, ఈసారి 50శాతం సబ్సిడీతో పంపిణీ చేయనున్నాం. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top