కొత్త రైలొచ్చె.. కష్టాలు కొనితెచ్చె!

Push Pull Train Problems In Bhadradri Kothagudem - Sakshi

పుష్‌పుల్‌ ట్రైన్‌తో ప్రయాణికుల పాట్లు

సాక్షి, కొత్తగూడెంఅర్బన్‌: ఈ ‘కొత్త’ రైలులో అనేక ‘వింతలు’, ‘విశేషాలు’ ఉన్నాయి. వాటిని తర్వాత చెప్పుకుందాం. కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి, పాత ముచ్చట్లు కొన్ని చదువుదాం. 
సింగరేణి విస్తరించిన ప్రాంతాలను కలుపుతూ, ‘సింగరేణి’ కుటుంబాల రాకపోకలకు అనువుగా దాదాపు 80 సంవత్సరాల క్రితం సింగరేణి ప్యాసింజర్‌ సర్వీస్‌ మొదలైంది. కారేపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు అప్పటి నుంచి రాకపోకలు సాగిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రైలులో ఎక్కువగా ప్రయాణిస్తున్నది ‘సింగరేణి’ కుటుంబాలే. సరే, ఇప్పుడు ఈ ‘కొత్త’ రైలు గురించి మాట్లాడుకుందాం. 

ఆహా...! ‘సొగసు’ చూడతరమా...!! 
మొన్నీమధ్య ఓ సింగరేణి కుటుంబం.. కారేపల్లి నుంచి కాగజ్‌నగర్‌ వరకు ఇందులో ప్రయాణించింది. ఆ కుటుంబంలో ఇద్దరు ఆడవాళ్లు, ఓ బుడ్డది, మరో బుడ్డోడు ఉన్నారు. ఆ రోజెందుకోగానీ, రైలు కిక్కిరిసి ఉంది. కాలు పెట్టేందుక్కూడా చోటు లేదు. రైలు కదిలిన కొద్దిసేపటికే... ‘‘అమ్మా... చిచ్చొస్తంది (మూత్రం)’’ అన్నాడు బుడ్డోడు. టాయ్‌లెట్‌ వద్దకు తీసుకెళ్లేందుకని వాడిని ఆ తల్లి ఎత్తుకుని డోర్‌ వద్దకు వెళ్లింది. ఆమెకు నవ్వాలో, ఏడ్వాలో అర్థమవలేదు. అక్కడ టాయ్‌లెట్‌ లేదు...!  బిత్తర చూపులు చూస్తోంది. అక్కడే నిలుచున్న ఓ సింగరేణి కార్మికుడు గమనించి– ‘‘మొత్తం 12 బోగీలున్న ఈ రైలులో రెండంటే రెండే టాయ్‌లెట్లు ఉన్నయ్‌. ముందొకటి.. వెనకొకటి. అంతే. ఇలా మనకు ‘అర్జంట్‌’ అయితే... పడుతూ లేస్తూ ఈ చివరికిగానీ, ఆ చివరికిగానీ పరుగెత్తాల్సిందేనమ్మా...!!!’’ అని చెప్పాడు.

తలుపు వద్ద నిలుచున్న ప్రయాణికులు పక్కకు తప్పుకోవడంతో, ఆ బుడ్డోడు మెట్ల మీదనే ‘వన్‌’ వదిలేశాడు. ‘‘బుడ్డోడు కాబట్టి ఇలా ‘వన్‌’ వదిలేశాడు. అదే ‘టూ’ అయితే..? పెద్దవాళ్లు, అందులోనూ ఆడవాళ్లు అర్జంట్‌గా టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే ఎలా...? ఈ రూట్‌లో ఈ రైలును పెట్టినోడిని కారేపల్లి నుంచి కాగజ్‌నగర్‌ వరకు, కాగజ్‌నగర్‌ నుంచి కారేపల్లి వరకు ఒక్కసారి బలవంతంగానైనా తిప్పాలి. అప్పుడు తెలుస్తుంది... టాయ్‌లెట్‌ కష్టాలేమిటో...’’ అంటూ, కొందరు ప్రయాణికులు చర్చ మొదలుపెట్టారు. 

ఆ ఇద్దరు బుడ్డోళ్ల తల్లికి, ఆమె వెంటనున్న మరొకామెకు భయం పట్టుకుంది. ‘‘ఇది (ఫుష్‌ పుల్‌) తెల్లవారుజామున 5.30 గంటలకు భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరింది. చివరి స్టేషన్‌ సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వెళ్లేసరికి సాయంత్రం 5.00 గంటలవుతుంది. మన ఆడోళ్లం, పిల్లలం... ఎంత ఇబ్బంది పడతామన్న సోయి కూడా రైల్వే అధికారులకు ఉండొద్దా...? నేనీ జన్మలో ఈ రైలెక్కను’’ అంది, ఆ బుడ్డోడి తల్లి. ‘‘కాగజ్‌నగర్‌ వెళ్లేంత వరకు ఈ ఇద్దరు బుడ్డోళ్లకు, మా ఇద్దరికీ ‘వన్‌’, ‘టూ’ రాకుండా చూడు స్వామీ’’ అని, ఆమె తన మనసులోనే తన ఇష్ట దైవాన్ని వేడుకుంది. 
 అప్పుడే, ఒకాయన పడుతూ–లేస్తూ వస్తున్నాడు. ‘‘ఛీఛీ... ఇదేం రైలురా బాబూ...! 12 బోగీలకు రెండే టాయ్‌లెట్సట. అందులో ఒకదానిలో నీళ్లు లేవు. ఇంకొకదానిలోకి వెళితే... భయంకరమైన కంపు. ఛీఛీఛీ... ఇంకోసారి ఈ రైలెక్కకూడదు’’ అంటూ, చిరాగ్గా మొహం పెట్టాడు. ఆ రైలుపై, అందులోని వసతులపై మళ్లీ చర్చ మొదలైంది. 

‘‘ఈ రైలులో లగేజ్‌ బెర్తులు కూడా లేవు. సీట్లు కూడా తక్కువే ఉన్నాయి. అంతకు ముందున్న ప్యాసింజరే బాగుండేది. ఇది మరీ అధ్వానంగా ఉంది. ఆ ప్యాసింజర్‌లో లగేజ్‌ బెర్తులుండేవి. సెల్‌ చార్జింగ్‌ సాకెట్స్‌ ఉండేవి. ఇందులో అవేవీ లేవు. ఇందులో ప్రయాణించడమంటే... నరకాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇంకొన్ని రోజులు గడిస్తే... ప్రయాణికుల సంఖ్య కచ్చితంగా తగ్గుతుంది. రైల్వేకు ఆదాయం పడిపోతుంది’’– ఆ బోగీలోని ప్రయాణికుల మధ్య ఇలా చర్చ సాగింది.

తగ్గుతున్న ప్రయాణికులు... పడిపోతున్న ఆదాయం 
ఈ రైలు ప్రారంభమై ఐదు రోజులవుతోంది. ఈ రైల్వే మార్గంలో తరచూ ప్రయాణించే వారికి ఈ ‘పుష్‌–పుల్‌’ కష్టాలు అనుభవంలోకి వచ్చినట్టున్నాయి. అవి అలా... అలా... అందరికీ చేరాయేమో...! ఈ ఐదు రోజుల్లోనే ఫుష్‌–ఫుల్‌ రైలు ఆదాయం పడిపోయింది. ఈ మార్గంలో రోజుకు వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.  ఇటీవలి వరకు (ప్యాసింజర్‌ ఉన్నప్పుడు) రోజు ఆదాయం 20,000 నుంచి 40,000 వరకు ఉండేది. పుష్‌–పుల్‌ వచ్చిన ఈ ఐదు రోజుల్లోనే ఆదాయం ఒక్కసారిగా గణనీయంగా 20,000 నుంచి 25,000 వరకు పడిపోయింది. ఈ రైలు కష్టాలు ఇలాగే కొనసాగితే... బోగీలన్నీ వెలవెలబోతాయేమో...! ప్రయాణికుల్లో అత్యధికమంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే, రైల్వే ఉన్నతాధికారులు సత్వరమే స్పందించకపోతే... నిజంగానే ఈ పుష్‌–పుల్‌ వెలవెలబోయినా పోతుంది. 

‘కొత్తొక రోత... పాతొక వింత...!’ 
ఈ ‘కొత్త’ రైలు రోత రోత. ఆ పాత రైలు బాగు బాగు– ఈ రైలు ప్రయాణికులు ముక్త కంఠంతో ఏకోన్ముఖంగా వినిపిస్తున్న అభిప్రాయమిది. ఈ ఫుష్‌–పుల్‌ రైలును రద్దు చేయాలని, ఆ పాత సింగరేణి ప్యాసింజర్‌ రైలునే నడిపించాలని రైల్వే ఉన్నతాధికారులను డిమాండ్‌ చేస్తున్నారు. వారు స్పందించకపోతే, ఆందోళనకు దిగుతామని సోషల్‌ మీడియా వేదికగా అనేకమంది ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు.

‘‘ఈ సమస్యపై ఏ ఒక్క పార్టీగానీ, ప్రజాప్రతినిధిగానీ స్పందించడం లేదు. వాళ్లు జనంలో ఉంటేగా... జనం సమస్యలు తెలియడానికి...! ఏ నాయకుడూ వద్దు, ఏ పార్టీ వద్దు. మనంతట మనమే ఆందోళనకు దిగుదాం..!! మన సమస్యపై మనమే పోరాడదాం...!!!’’ అని, సోషల్‌ మీడియా వేదికగా ఈ రైలు ప్రయాణికులు చర్చలు, సన్నాహాలు సాగిస్తున్నారు. 
రైల్వే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకపోతే... ఈ ‘పుష్‌–పుల్‌ బాధిత’ ప్రయాణికులు రేపోమాపో ప్రత్యక్ష కార్యాచరణకు దిగినా దిగుతారేమో...!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top