ఆత్మవిశ్వాసం నింపాలి

Psychologists Gives Suggestions To Parents About Children - Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పిల్లలు కుంగిపోకుండా చూడాలి

తల్లిదండ్రులకు సైకాలజిస్ట్‌ల సూచన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి, సుదీర్ఘ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ వయసుల్లోని పిల్లలు, టీనేజర్లపట్ల తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలని సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు, వాటి వల్ల ఎదురుకాబోయే పరిణామాల గురించి శాస్త్రీయంగా అవగాహన కల్పించాలని, పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఆత్మవిశ్వాసం, మనోధైర్యం పెం పొందించే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. స్కూళ్లు మూతపడటం, బయట ఆడుకునేందుకు అవకాశం లేకపోవడం, స్నేహితులను కలుసుకోలేకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో పిల్లలు మానసిక కుంగుబాటుకు గురి కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ అంశంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే...

ప్రేమ చూపాలి..
పిల్లలపై ముఖ్యంగా టీనేజర్లపై తల్లి దండ్రులు ప్రేమ చూపాలి. వారంటే తమకెంత ముఖ్యమో వివరిం చాలి. వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా వ్యవహరించాలి. తామెందుకు బయటకు వెళ్లి, ఆడుకోలేకపోతున్నామనే బాధలో ఉన్న పిల్లలకు ప్రస్తుత పరిస్థితులు వివరించాలి. జాగ్రత్తలు చెప్పాలి. పెద్దలు, పిల్లలు ఒక షెడ్యూల్‌ను నిర్ణయించుకొని ఉదయం నిద్రలేవడం మొదలు, కాలక్షేపం, టిఫిన్, భోజన సమయాలు వంటి వాటిని రూపొందించుకొని వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. కొందరు పిల్లల్లో గణితం లేదా సైన్స్‌ ఇతర సబ్జెక్టులంటే భయం ఉంటుంది.

ఈ సమయంలో అటువంటి వాటి పట్ల భయం పొగొట్టేలా చర్యలు తీసుకోవాలి. టీనేజర్లకు వారి వ్యక్తిగత స్పేస్‌ దొరికేలా చూడాలి. పిల్లలతో శాంతంగా వ్యవహరిస్తూ సంభాషణ కొనసాగించాలి. భవిష్యత్తులో ఆర్థికపరంగా, విద్యాపరంగా ఎలాంటి సమస్యలు రావని, ఎలాంటి విపత్కర సమస్య వచ్చినా తగిన పరిష్కారాలుంటాయని వారికి వివరించాలి. గతంలో కూడా వివిధ మహమ్మారులు వచ్చినా ప్రపంచం, దేశం నిలదొక్కుకుందని, పిల్లలపై వాటి ప్రభావాలు పడలేదని, ఆ తర్వాత కూడా అందరూ ఆనందంగా ఉన్నారన్న అవగాహనను కల్పించాలి. – స్కూల్‌ సైకాలజిస్ట్‌ కళై అముధ

అవగాహన కల్పించాలి...
లాక్‌డౌన్‌ ఎత్తేశాక తలెత్తే పరిస్థితులు, జీవితంపై పడబోయే ప్రభావాలను తల్లితండ్రులు పిల్లలకు వివరించాలి. ఈ పరిణామాల తర్వాత ఏర్పడబోయే జీవితాన్ని కొత్తగా చూసేలా అవగాహన కల్పించాలి. భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోగలిగే మనోస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. జీవితం నుంచి నేర్చుకొనే లర్నింగ్‌ ప్రాసెస్‌కు సిద్ధం చేయాలి. పరిస్థితులు చక్కబడిన అనంతరం ఉత్సాహంగా సమయాన్ని గడిపేలా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిం చాలి.

ప్రస్తుతం పిల్లలను ఎలా ఎంగేజ్‌ చేయాలో తల్లితండ్రులకు సరైన అవగాహన లేక సమస్యలు ఎదురవుతున్నాయి. తల్లి దండ్రులు మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలతోనే మొత్తం సమయం గడపకుండా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటా యించి అది అమలయ్యేలా చూడాలి. పిల్లలతో కూర్చొని ఆయా అంశాలపై చర్చించడంతోపాటు స్కూళ్లు, కాలేజీలు మొదలయ్యాక ఎలా వ్యవహరించాల్సి ఉంటుం దన్న విషయమై అవగాహన కల్పించాలి. – సైకాలజిస్ట్‌ డాక్టర్‌ సి.వీరేందర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top