విత్తన సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు

Preparation for the Seed Summit prestigiously - Sakshi

ప్రభుత్వ సీఎస్‌ ఎస్కే జోషి ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 26వ తేదీ నుంచి జులై మూడు వరకు హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ విత్తన సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం దానిపై ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశం జరిగింది. సాధ్యమైనంత త్వరలో పనులన్నీ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్‌కు వస్తున్నందున భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఇలాంటి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సదస్సులో భారతదేశం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఏవో సహకారంతో సదస్సుకు ముందు జూన్‌ 24, 25 తేదీలలో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులతో విత్తనోత్పత్తిపై ప్రత్యేక సదస్సు ఉంటుందని, దీనికి తెలంగాణ విత్తన పరిశ్రమ నుంచి కూడా విత్తన ప్రతినిధులు పాల్గొంటున్నారని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. విత్తన ఎగుమతులు, దిగుమతులకు మంచి వేదిక కానున్నదన్నారు. జూన్‌ 27న విత్తన రైతుల ప్రత్యేక సమావేశానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, విత్తనోత్పత్తి, విత్తన నాణ్యతపై రైతులకు మంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని, తెలంగాణ నుంచి 1500మంది విత్తన రైతులు, గుజరాత్, కర్ణాటకలకు చెందిన విత్తన రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని వ్యవసాయశాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు.  

అంతర్జాతీయ విత్తన సదస్సు ముఖ్యాంశాలు.. విశేషాలు 
- వేదిక – హెచ్‌ఐసీసీ, నోవాటెల్, హైదరాబాద్‌ 
ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉందనే అంశంపై చర్చలు 
తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులకు ప్రోత్సాహకం 
జూన్‌ 26 నుంచి 28 వరకు విత్తన ప్రదర్శన
జూన్‌ 27న తెలంగాణ విత్తన రైతుల ప్రత్యేక సమావేశం 
70 దేశాల నుంచి 800 మంది విత్తన ప్రముఖులు
ఆఫ్రికా ఖండపు దేశాల ప్రతినిధులతో తెలంగాణ విత్తన పరిశ్రమ ప్రతినిధుల ప్రత్యేక సమావేశం 
94 ఏళ్ల ఇస్టా చరిత్రలో తొలిసారిగా ఆసియా ఖండంలో హైదరాబాద్‌లోనే నిర్వహణ 
సదస్సుకు నోడల్‌ ఆఫీసర్‌గా కేశవులు నియామకం.

ఎస్‌ఎల్‌బీసీపై వివరణ కోరిన సీఎస్‌ 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల్లో అవాంతరాలు, ఆగిన పనులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి నీటి పారుదల శాఖ నుంచి వివరణ అడిగారు. ప్రాజెక్టుల పరిధిలో ఇప్పటివరకు జరిగిన పనులు, పెండింగ్‌ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరారు. టన్నెల్‌ పనులు ఏడాదిగా ఆగాయని, దీనికి తోడు కరెంట్‌ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితుల్లో ప్రాజెక్టు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్న వైనంపై ‘సాక్షి’ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఇంకా అవసరమైన నిధులు, ఏజెన్సీ ఇదివరకు అడ్వాన్సులు కోరుతూ పెట్టిన అర్జీల అంశాలతో నీటి పారుదల శాఖ నోట్‌ సిద్ధం చేస్తోంది. పనుల పూర్తికి కనీసం రూ.80కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని ఏజెన్సీ కోరుతోంది. దీనిపై త్వరలోనే జరిగే కేబినెట్‌ భేటీలో ఓ నిర్ణయం చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top