సొరంగం పనులు ముందుకు సాగేదెప్పుడు? | SLBC tunnel excavation stalled from both the outlet and inlet sides | Sakshi
Sakshi News home page

సొరంగం పనులు ముందుకు సాగేదెప్పుడు?

May 26 2025 12:33 AM | Updated on May 26 2025 12:33 AM

SLBC tunnel excavation stalled from both the outlet and inlet sides

ఔట్‌లెట్, ఇన్‌లెట్‌ రెండు వైపుల నుంచి నిలిచిపోయిన తవ్వకం 

పలు ఆటంకాలతో ఏళ్లు గడిచిపోతున్న వైనం 

ఔట్‌లెట్‌లో టీబీఎం బేరింగ్‌ పాడైపోవడంతో 2023 మొదట్లోనే పనులు బంద్‌ 

ఇన్‌లెట్‌లో తొలిసారి 2019లోనిలిచిన పనులు 

కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక కదలిక..ఈ ఏడాది ఫిబ్రవరిలో కుప్పకూలిన సొరంగం 

టెక్నికల్‌ కమిటీ నివేదిక వచ్చాకే ఇన్‌లెట్‌ పనులపై నిర్ణయం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఉన్న ఔట్‌లెట్‌లో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) బేరింగ్‌ పాడై 2023 జనవరిలోనే పనులు ఆగిపోగా, దోమలపెంట వద్ద ఇన్‌లెట్‌లో షియర్‌ జోన్‌ కారణంగా బురద నీరు ఉబికి రావడంతో 2019 నుంచి పనులు ఆగిపోయాయి. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సొరంగం తవ్వకం పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. 

అయినా వివిధ కారణాలతో టన్నెల్‌ తవ్వకం పనులకు అవాంతరాలు తప్పడం లేదు. ఔట్‌లెట్‌లో టీబీఎంకు అమర్చాల్సిన బేరింగ్‌ను తెప్పించినా, స్పేర్‌ పార్ట్స్‌కు అవసరమైన డబ్బులు లేవంటూ కాంట్రాక్టు సంస్థ చేతులెత్తేయడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల ఇన్‌లెట్‌లో 14వ కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై ఉన్నత స్థాయి టెక్నికల్‌ కమిటీ నివేదిక వస్తేనే గానీ ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. 

ఏళ్లు గడిచిపోతున్నా.. 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో 2005లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టు పనులు చేపట్టారు. అయితే అనేక అవాంతరాలతో ఏళ్లు గడిచిపోతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీటిని పూర్తి గ్రావిటీ ద్వారా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వరకు తరలించేందుకు ప్రభుత్వం సొరంగం తవ్వకాన్ని చేపట్టింది. 

43.930 కిలోమీటర్ల పొడవైన సొరంగం పూర్తిగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు, పర్యావరణ రక్షణ కోసం డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం కాకుండా టీబీఎం ద్వారా పనులు చేపట్టింది. ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ కలిపి 34.37 కిలోమీటర్లు మేర టన్నెల్‌ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది.  

ఔట్‌లెట్‌లో బేరింగ్‌ పాడై..వచ్చినా లోపలికి వెళ్లక 
ఔట్‌లెట్‌లో 20.435 కిలోమీటర్లు సొరంగం తవ్వకం పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్ల తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టీబీఎం బేరింగ్‌ పాడైపోవడంతో 2023 జనవరిలో పనులు ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సొరంగం పూర్తి చేయాలని నిర్ణయించింది. అమెరికా నుంచి బేరింగ్‌ తెప్పించేందుకు నిర్ణయించి గత ఏడాదే రాబిన్స్‌ కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వడంతో అది గత నెల 18వ తేదీన మన్నెవారిపల్లికి చేరింది. 

నెల దాటినా.. 
అమెరికా నుంచి బేరింగ్‌ అయితే వచ్చింది. కానీ బేరింగ్‌ను టీబీఎంకు ఫిట్‌ చేసేందుకు అవసరమైన పరికరాలతోపాటు మరికొన్ని పరికరాలను కెనడా నుంచి తెప్పించాల్సి ఉందని కాంట్రాక్టు సంస్థ పేర్కొంది. అందుకు రూ.70 కోట్లు కావాలని విన్నవించింది. వాస్తవానికి ఆ నిధులను కాంట్రాక్టు సంస్థే వెచ్చించాలి. కానీ తమ వద్ద డబ్బుల్లేవని, ప్రభుత్వం ఇస్తేనే ముందుకు పోతామని స్పష్టం చేయడంతో బేరింగ్‌ను వచ్చినా టన్నెల్‌ లోపలికి తీసుకెళ్లని పరిస్థితి నెలకొంది.

 ప్రభుత్వం దీనిపై కాంట్రాక్టు సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఔట్‌లెట్‌లో ఇంకా 3.545 కిలోమీటర్లే తవ్వాల్సి ఉంది. అయితే టీబీఎంకు మిగిలి ఉన్న సామర్థ్యం, అక్కడి మట్టి పొరలు, రాక్‌ ఫార్మేషన్‌ పరిస్థితులను బట్టి ఇంకా 2 కిలోమీటర్ల వరకే తవ్వే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత 200 మీటర్ల పొడవునా షియర్‌ జోన్‌ ఉండటంతో ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.  

ఇన్‌లెట్‌లో పనులకూ అవాంతరాలు 
సొరంగం ఇన్‌లెట్‌ దోమలపెంట వైపు నుంచి 13.935 కిలోమీటర్ల తవ్వకం గతంలోనే పూర్తయింది. ఇంకా 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే 14వ కిలోమీటరు కంటే ముందు షియర్‌ జోన్‌ కారణంగా పెద్ద ఎత్తున బురద, మట్టి ఉబికి వస్తుండటంతో 2019లోనే పనులు ఆగిపోయాయి. అ యితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన టీబీఎంతో తవ్వుతుండగా సొరంగం పైకప్పు కూలిపోవడం, టీబీఎం ముక్కలైపోవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది గల్లంతవగా ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలు మాత్రమే బయ పడ్డాయి. కాగా మిగతా కార్మికుల వెలికితీత పనులను కూడా ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది. ప్రస్తుతం సొరంగం పనులు ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.

ఇన్‌లెట్‌లో పనులు మొదలయ్యేదెప్పుడో..
సొరంగం ఇన్‌లెట్‌ నుంచి తవ్వకాలు చేపట్టే టీబీఎం పూర్తిగా ధ్వంసం కాగా, ఇకనుంచి డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలోనే సొరంగం తవ్వకం సాధ్యమవుతుందని నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఇన్‌లెట్‌లో 14వ కిలోమీటరు వద్ద కుప్పకూలిన ప్రాంతాని కంటే ముందు నుంచి 50 మీటర్ల వరకు పక్కకు జరిగి, అక్కడి నుంచి సొరంగానికి సమాంతరంగా తవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వివిధ సంస్థలకు చెందిన నిపుణులతో ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాట చేసింది. 

పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఆ తర్వాతే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రమాదం నేపథ్యంలో నిపుణుల సూచన మేరకు డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానంలో తవ్వకం పనులు చేపట్టాలంటే కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement