ఎస్‌ఎల్‌బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వే | Electromagnetic survey on SLBC works | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎల్‌బీసీ పనులపై ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వే

Jun 12 2025 3:36 AM | Updated on Jun 12 2025 3:36 AM

Electromagnetic survey on SLBC works

టన్నెల్‌ ప్రాంతంలో నేల స్వభావాన్నికచ్చితంగా గుర్తించే ప్రయత్నం 

రక్షణ శాఖహెలికాప్టర్లతో సర్వే నిర్వహిస్తాం:మంత్రి ఉత్తమ్‌  

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ తవ్వకం పనులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. టన్నెల్‌ ప్రాంతంలోని నేల స్వభావాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్లతో ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ సర్వే చేయించాలని నిర్ణయించింది. అందుకోసం తక్కువ ఎత్తులో ఎగిరే సామర్థ్యం గల రక్షణ శాఖకు చెందిన రెండు హెలికాప్టర్లు వినియోగించనున్నారు. సర్వే పరికరాలను డెన్మార్క్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించనున్నారు. 

ఈ సర్వేపై బుధవారం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ పాటిల్, సీఈ అజయ్‌కుమార్‌లు నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డైరెక్టర్‌ వీరేంద్ర తివారీ, బార్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ డీజీగా పనిచేసిన హర్‌పాల్‌సింగ్, కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రాలతో విడివిడిగా భేటీ అయ్యారు. టన్నెల్‌ పునరుద్ధరణ, సర్వే, నిర్మాణ పనులపై వారితో చర్చించారు. సర్వే కోసం రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఇవ్వాలని కోరగా, రక్షణ శాఖ అధికారులు అంగీకరించినట్లు మంత్రి తెలిపారు. 

ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ పరికరాలతో జరిపే సర్వే భూ ఉపరితలం నుంచి ఒక కిలోమీటర్‌ లోతు వరకు నేల స్వభావంతో పాటు ఇతర సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. నేల స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా నిర్మాణ పనులు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. జూలై 12న సర్వే మొదలై వారం రోజుల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో టన్నెల్‌ పనులను పూర్తిచేసి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లగొండ జిల్లాకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

టన్నెల్‌ పనుల పూర్తికోసం కల్నల్‌ పరీక్షిత్‌ మెహ్రా డిప్యుటేషన్‌పై రెండేళ్లపాటు సాగునీటి శాఖలో స్పెషల్‌ సెక్రటరీ హోదాలో పనిచేస్తారని చెప్పారు. టన్నెల్‌ తవ్వకాల్లో అపార అనుభవం ఉన్న జనరల్‌ హర్పాల్‌ సింగ్‌ తెలంగాణ ప్రభుత్వానికి జీతం తీసుకోకుండా గౌరవ సలహాదారుగా సేవలు అందిస్తారని వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement