హైదరాబాద్‌కు ‘హై’పవర్‌!

Power supply system capacity become double in hyderabad - Sakshi

రెట్టింపయిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యం  

కొత్త లైన్లు, టవర్ల నిర్మాణం లేకుండానే సాధ్యం 

ప్రత్యేక కండక్టర్లు బిగించడంతో సాకారం 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యుత్‌ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంది. కొత్త టవర్లు నిర్మించకుండానే, కొత్త లైన్లు వేయకుండానే ప్రస్తుత లైన్లకు ‘హై టెంపరేచర్‌ లాసాగ్‌’ (హెచ్‌టీఎల్‌ఎస్‌) కండక్టర్లను అమర్చి హైదరాబాద్‌లో 70 కిలోమీటర్ల డబుల్‌ సర్క్యూట్‌ 220 కేవీ విద్యుత్‌ సరఫరా లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో రూ.1,100 కోట్లు ఆదా చేయడంతోపాటు మూడేళ్లు పట్టే పనిని 3నెలల్లో పూర్తిచేసింది. సామర్థ్యం పెంచేందు కు ఏర్పాటు చేసిన కండక్లర్లను విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం ప్రారంభించారు. అధిక లోడ్‌ లైన్ల సామ ర్థ్యం పెంపుతో హైదరాబాద్‌లో విద్యుత్‌ సరఫరాలో అప్పుడప్పుడు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు పరిష్కారం కానున్నాయి.  

రూ.1,100 కోట్లు ఆదా..: పారిశ్రామిక, వాణిజ్య, గృహ విద్యుత్‌ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. గతేడాది 2,950 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ రాగా, ఈ ఏడాది 3,276 మెగావాట్లకు చేరింది. ప్రస్తుతమున్న లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి పెరిగింది. ఎక్కువ లోడ్‌ గల రూట్లలో సరఫరాలో అప్పుడప్పుడు అవాంతరాలు తప్పట్లేదు. 400 కేవీ లైన్ల నుంచి 220 కేవీ విద్యుత్‌ను తీసుకొచ్చే మామిడిపల్లి– శివరామ్‌పల్లి, మల్కాపురం– షాపూర్‌నగర్, శంకరపల్లి–గచ్చిబౌలి లైన్లపై అధిక ఒత్తిడి ఉన్నట్లు నిర్ధారించారు. ఈ లైన్లలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ మూడు లైన్లు కలిపి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొత్తగా టవర్లు నిర్మించి, 220 కేవీ లైన్లు వేయాల్సిన పరిస్థితి ఉండేది.

ఇలా చేయడం వల్ల రూ.1,200 కోట్ల వ్యయం అవుతుంది. పైగా మూడేళ్ల సమయం పట్టేది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి టవర్లు, లైన్లు నిర్మించకుండానే ప్రస్తుతమున్న లైన్ల సామర్థ్యాన్ని ప్రత్యేక కండక్టర్లు అమర్చడం ద్వారా రెట్టింపు చేసింది. ఈ కండక్టర్ల సామర్థ్యాన్ని మొదట నార్కట్‌పల్లి ప్రాంతంలో 20 కిలోమీటర్ల 132 కేవీ లైన్లలో పరీక్షించారు. ట్రాన్స్‌కో సాంకేతిక బృందం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ కండక్టర్లను వాడాలని సిఫారసు చేసింది. టెస్ట్‌ రన్‌ కూడా విజయవంతం చేసిన తర్వాత, బుధవారం నుంచి అధికారికంగా ఈ మూడు లైన్లలో కండక్టర్లను అనుసంధానం చేశారు. దీంతో విద్యుత్‌ సరఫరా పరిస్థితి మెరుగైంది. 4 వేలకు పైగా డిమాండ్‌ తట్టుకునే సామర్థ్యం పెరిగింది. మూడేళ్ల వరకు ఢోకా లేకుండా హైదరాబాద్‌కు విద్యుత్‌ సరఫరా చేయొచ్చు. దీనికి రూ.100 కోట్ల వ్యయమైంది. 

400 కేవీ రింగ్‌ ఏర్పాటు
 ‘హైదరాబాద్‌ ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశ్ర మలు, వ్యాపారం, వాణిజ్యం, కార్యాలయాలు అన్నీ కరెంటుపై ఆధారపడి నడుస్తున్నాయి. ఎక్కడా విద్యుత్‌ కోతల్లేకుండా, సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తున్నాం. డిమాండ్‌కు తగినట్లు విద్యుత్‌ సరఫరా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే హైదరాబాద్‌ చుట్టూ 400 కేవీ రింగ్‌ ఏర్పాటు చేశాం. నాలుగు 400 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మించాం. అక్కడి నుంచి 220 సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ సరఫరా చేసే లైన్ల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెంచుతున్నాం’  
– ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top