కేసీఆర్ పాలన అవినీతికి నిలయంగా, మోసానికి, దగాకు ప్రతీకకగా మారిందని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
సాక్షి, వరంగల్ అర్బన్: కేసీఆర్ పాలన అవినీతికి నిలయంగా, మోసానికి, దగాకు ప్రతీకకగా మారిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజల సాక్షిగా సీఎం కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. పోలీస్ అకాడమీ పేరు మార్పు విషయంలో, ఆగస్ట్ 15న ఉద్యోగ నియామకాల విషయంలో చెప్పినవన్నీ అబద్దాలేనని స్పష్టం చేశారు. అబద్ధాలతో కాలయాపన చేస్తున్న సీఎం ఉద్యమం, సెంటిమెంట్ పేరుతో ప్రజలన మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎకరానికి కోటి రూపాయలు ఎలా సంపాదించాలో రైతులందరికీ చెప్పాలని కోరారు.
ఉత్తమ రైతు అవార్డు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏనాటి ఫోటోలో ఇప్పుడు ట్వీట్ చేసి ఐటీ మంత్రి కేటీఆర్ కూడా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏకఛత్రాధిపత్యంగా తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తామేదో గొప్ప చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ వచ్చాక తెలంగాణ భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు. ఇకనైనా ఆటలు, మాటలు కట్టిపెట్టి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటే మంచిదని సూచించారు.