పళ్ళు కొరికిండ్రు.. జెండాలు పడేసిండ్రు | Political Satirical Story on Telangana Elections Campaign | Sakshi
Sakshi News home page

పళ్ళు కొరికిండ్రు.. జెండాలు పడేసిండ్రు

Nov 17 2018 9:25 AM | Updated on Nov 17 2018 9:28 AM

Political Satirical Story on Telangana Elections Campaign - Sakshi

కాకా... నేను ముందె జెప్పలే... గీల్లు లొల్లి చేస్తరని! ‘అరె నువ్‌ బేఫికర్‌గుండు... నీకే టికెట్‌ వస్తద’ని ఆశబెట్టి నిన్న మొన్నటి దాంక పాగల్‌లెక్క తిప్పుకున్నోల్లు ... గీసారి జర సర్దుకోరాదె! అంటె ఎవుడికైన మెంటల్‌ లేస్తది. టికెట్‌ అస్తదని పార్టీల... ఆశావహుడని మీడియాల... జోర్‌దార్‌గ ప్రచారం చేసుకున్నోల్లు లిస్ట్‌ల తమ పేరు ఇంగ రాదని తెల్సుకున్నాంక ఊర్కె ఉంటారె. నిప్పుల ఉప్పేసినట్లు చిటచిట అంటరు. అయినా టికెట్‌ రాకపోతె గప్పుడు వచ్చే గుస్సానే వేరు. గీకతల్లో పాతోల్లు కొత్తోల్ల కతలన్ని ఒకే తీరుగుంటయ్‌!

అసలు  గుస్సా వచ్చుడే బేకారనుకుంటే గిట్లాంటోల్లు అయిదురకాలని లెక్క దేల్చిండు మా ఎంకటేసు! మొదటి రకం... గీల్లు  గదేం తావీద్‌ కట్టుకునింటరో ... ఏం జేసిన కోపం రాదు. గానీ కొందరుంటారు... ఆల్లని అరె అన్నా కోపం... అన్నా అన్న కోపం. కొందరు ముకాలు ఎర్రజేస్కొని.. కండ్లెర్రజేస్కొని కర్రలెక్క బిగుసుకుపోయి ఉంటరు. ఈల్లు గా టైంల సచ్చిన నోరెత్తరు. అంతా గప్‌చుప్‌. ముకాలు చూసే ఇవతలోల్లు గుర్తుపట్టాలె. నాల్గో టైపోల్లుంటరు ఈల్లకి కోపం వస్తే సాలు అగ్గిరాముల్లో... రాములమ్మలో అవుతరు. నోరు తెర్సుడు... బూతులు తిట్టుడే తిట్టుడు. ఇంగ లాస్ట్‌ అయిదోరకం... ఈల్లు సానా డేంజరు. కోపం వస్తే మెంటల్‌ వచ్చినట్లు గత్తర్‌ బిత్తర్‌ చేస్తరు. చేతిల ఏదుంటే గది ఇసిరి కొడ్తరు. పురానాల్లో రాసిండ్రు గద... ఇంట్లో ఎవరికైన కోపం వస్తె ఓ రూములకెల్లి దర్వాజ బంద్‌ చేస్కునేటోల్లంట. గది జూసి అరె ఈ శాల్తీకి కోపం అచ్చిందనుకోవాలె. సత్యభామకి కోపం వస్తె గిట్లనే ఓ రూమ్‌ల దూరి ఆగమాగం సేసిందంట! ఆ కిట్టయ్య కాల్లు పట్కుంటే గానీ దార్లోకి రాలెదంట!  

గీ ఎలచ్చన్లలోనె సూడు. కూటమి అంటూ జత కట్టినోల్ల కస్టాలు అన్నిన్ని గావు. టికెట్‌ రానోల్లు పండ్లు పటపట కొరికిండ్రు...పార్టీ ఆపీసుల జెండాలు పీకి పడేసిండ్రు... కొంతమంది ఢిల్లీకెల్లి కాంగ్రెస్‌ ఆపీసు ఎదుట హర్తాల్‌ చేస్తుండ్రు. సిటీలో అయితే అంతా ఆగమాగం. ఎవ్రు ఎందుకరుస్తుండ్రో..ఎందుకు కరుస్తుండ్రో తెల్వదు. రాజేంద్రనగర్‌ల టికెట్‌ గీయలేదని సబితమ్మ కొడుకు కార్తీక్‌ లిస్ట్‌ల మీరు పేరు తీసుడేంది... నేనే పార్టీ నుంచి ఎల్లిపోతున్న... బైట మా కార్యకర్తలుండ్రు. మీ కాండేట్‌కు పోటీగా నిలుస్తా...గెలుస్తా అంటూ డైలాగులు దంచుతుండ్రు. గప్పట్లో సిటీ మేయర్‌గా మెరిసిన కార్తీకమ్మ టికెట్‌ కోసం ఢిల్లీలో రాహుల్‌ ఎదురుంగ  బైటాయించింది. గీ బాధ పడ్లేక అభ్యర్థులు గొందరు ఎందుకైన మంచిదని బౌన్సర్లను పెట్టిండ్రంట! గా పబ్‌లల్ల...బారులల్ల ఉంటరు సూడు ఆల్లే!

పొన్నాలన్న టికెట్‌ గాల్లో కొట్టుకుపోయిందంటె ఇంగ సూడండ్రి. కొంతమంది శానీలు ఢిల్లీకెల్లి లిస్ట్‌ల పేరు వస్తదో లేదో తేల్చుకుని... పక్క గల్లీల ఉన్న మరో పార్టీల దూరుతుండ్రంట. గీ జట్టుకట్టిన పార్టీల్లో జుత్తు పీక్కొనేదొకటే తక్కువ. ఇజ్జత్‌ తీసింది గాకుండా... బండ్లకు మైకులు గట్టి ... ఆ గట్టునుంటావా ఓ అన్న ఈ గట్టునుంటావా అంటూ పాటలు పెట్టుడొకటి. అరె చల్‌... టికెటివ్వక మోసం చేసిండ్రు. ఇంగ మేం ఏ గట్టునుంటె మీకెందుకు? ఏ గడ్డి పీకితె మీకెందుకు? అంటూ అరుసుకుంటుండ్రు. మొన్న నిర్మల్‌ల ఓ పోరగాడు... గాయన ఏం ఆలోచించిండో గాని... పొద్దున్నే బీజేపీల చేరి...మధ్యాహ్నం కారులో దూరి...సాయంత్రం కాంగ్రెస్‌ల దేలిండు. ఇంగా గిట్లాంటివి ఎన్ని సూడాలొ? కాకా గిదింకా మొదలు..ముందున్నాది అసల్‌ కత!!– రామదుర్గం మధుసూదనరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement