రాష్ట్ర సాధనకు జైపాల్‌ కృషి 

Political Parties Leaders Praises Jaipal Reddy Over His Contribution To Telangana State Formation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు హైదరాబాద్‌ నగరం తెలంగాణకే చెందేలా నాడు కేంద్ర మంత్రి హోదాలో సూదిని జైపాల్‌రెడ్డి తీసుకున్న చొరవ, కృషి అభినందనీయమని పలు రాజకీయ పార్టీల నాయకులు కొనియాడారు. జైపాల్‌రెడ్డి 78వ జయంతి కార్యక్రమాన్ని గురువారం నెక్లెస్‌ రోడ్‌లోని జైపాల్‌ ఘాట్‌ వద్ద నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు డి.శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీలు పల్లంరాజు, విశ్వేశ్వర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరై నివాళి అర్పించారు.

రాష్ట్ర సాధనలో జైపాల్‌రెడ్డి కృషి మరువలేనిదని, ఆయన వల్లే తెలంగాణకు హైదరాబాద్‌ దక్కిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి గుర్తు చేశారు. పదేళ్లపాటు జైపాల్‌రెడ్డి ఎంపీగా తాను ఎమ్మెల్యేగా కలసి పనిచేశామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచి పార్లమెంట్, శాసన సభ, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో అద్భుత ప్రసంగంతో ఆయన చెరగని ముద్రవేసుకున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జైపాల్‌రెడ్డి పేరు పెట్టినప్పుడే ఆయనకు సరైన నివాళి ఆర్పించినట్లవుతుందన్నారు. విలువల కోసం జీవితాంతం నిజాయితీగా, సిద్దాంతాన్ని కఠినంగా అమలు చేసిన వ్యక్తి జైపాల్‌రెడ్డి అని, ఆయన మరణం సెక్యులరిజానికి, సోషలిజానికి తీరని లోటని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

జైపాల్‌రెడ్డి మచ్చలేని నాయకుడని, వామపక్షాలు బలంగా ఉండాలని కోరుకునే వారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. జయంతి కార్యక్రమంలో జైపాల్‌ కుమారుడు ఆనంద్‌రెడ్డి, సన్నిహితుడు వెంకట్రాంరెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ రామచంద్రమూర్తి, ఎన్‌ఆర్‌ఐ, ఆటా మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి, దైవజ్ఞశర్మతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top