విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు

Police Personnel Received Medals In Ravindra Bharathi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ నడుస్తోందన్నారు. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ ఆధ్వర్యంలో సర్వీస్‌ మెడల్స్‌ డెకరేషన్‌ పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్‌ అలీ విధుల్లో విశిష్ట సేవలందించిన పోలీసులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్‌ శాఖపై నమ్మకం పెరిగిందన్నారు. గత ఆరేళ్ల నుంచి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండటంతో పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నారు. పోలీస్‌ శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. పోలీసు అధికారులకు హోంమంత్రి అవార్డులు అందజేయడం శుభపరిణామంగా పేర్కొన్నారు.

డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో ప్రావీణ్యం చూపించిన పోలీసు అధికారులకు మెడల్స్‌ అందించడం గర్వకారణమన్నారు. రాత్రనక, పగలనక, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసిన పోలీసు అధికారులకు పతకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కష్టపడి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మంచి పేరు తెచ్చారని పోలీసులను ప్రశంసించారు. పోలీసుల సేవకు వారి కుటుంబాలు అందించే ప్రోత్సాహమే కీలకమన్నారు. 400 మందికి పైగా పోలీసు అధికారులకు ఒకేసారి అవార్డులు ఇవ్వడం రికార్డ్‌గా మిగిలిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్‌ గ్యాలంటరీ అవార్డులు, పీఎం సర్వీస్ మెడల్స్, ఉత్తమ సేవా పతకాలు, మహోన్నత సేవా పతకాలు, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర సర్వోన్నత పోలీసు పతకంతో పాటు పలు మెడల్స్‌ను పోలీసులు అందుకున్నారు. మొత్తంగా 418 మంది పోలీసు అధికారులకు పతకాలు బహుకరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top