కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి

Police Laticharge On KU Students In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్‌ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్‌ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్‌ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు.

90 రోజుల షెడ్యూల్‌ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్‌ చాంబర్‌ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. కాగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝలిపించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top