పోలీస్‌ శాఖలో కలవరం

Police Department announced High alert in Few Districts - Sakshi

జిల్లాల్లో మావోయిస్టు యాక్షన్‌ దళాల కదలికలు 

అప్రమత్తంగా ఉండాలంటూ ఐదు జిల్లాల ఎస్పీలకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పోలీస్‌ ఉన్నతాధికారుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న టెన్షన్‌ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ముగిశాక ఇక్కడ పోలింగ్‌ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. పలుచోట్ల మావోయిస్టుల పోస్టర్లు, హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, ఖమ్మంలో ఎన్నికలకు విఘాతం కలిగించేందుకు మావోలు కుట్రపన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటికితోడు సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తొలిదఫా ఎన్నికల అనంతరం మావోయిస్టు యాక్షన్‌ దళాలు రాష్ట్ర సరిహద్దుల్లోకి చేరుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సరిహద్దుల్లోని భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పోలీస్‌ శాఖ హైఅలర్ట్‌ ప్రకటించింది. బయటకు విషయం పొక్కనీయకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది.  

ప్రవేశించడం సులభమా? 
ఛత్తీస్‌గఢ్‌లో చెదురుమదురు ఘటనలకు పాల్పడ్డ మావోయిస్టు పార్టీ తెలంగాణవైపు వచ్చేందుకు యత్నించినా నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీనియర్‌ ఐపీఎస్‌ ఒకరు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సంచరించే డివిజన్‌ కమిటీకి చెందిన యాక్షన్‌ దళాలే తిరుగుతున్నట్లు సమాచారం ఉందని ఎస్‌ఐబీ చెప్తోంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో అన్ని డివిజన్‌ కమిటీల యాక్షన్‌ బృందాల కార్యకలాపాలు విస్తృతం చేయాలని నిర్ణయించారని, అందులో భాగంగానే గుర్తింపు కోసం శబరి కమిటీ, మంచిర్యాల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నాయని ఎస్‌ఐబీ తెలిపింది.  

సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దు... 
మావో ప్రాభల్య నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లవద్దని నేతలకు ఆయా జిల్లాల ఎస్పీలు సూచించినట్లు తెలిసింది. ఒకవేళ వెళ్లాల్సివస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top