
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తూ దశాబ్దకాలంపాటు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మిషన్ 2024ను పోలీసుశాఖ రూపొందింస్తోంది. ఇందులో భాగంగా డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో ఐపీఎస్‌లు సోమవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలు, ఎజెండాను దృష్టిలో పెట్టుకొని మిషన్ 2024పై చర్చించారు. మహిళా రక్షణ కోసం చేపట్టిన/చేపట్టబోయే చర్యలతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సామాజిక భద్రతలో ప్రజల భాగస్వామ్యం పెంపు, నేరాల నియంత్రణ తదితర అంశాలపై వేర్వేరు నివేదికల తయారీకి నిర్ణయించారు.
పోలీసుశాఖలో సమూల మార్పులు...
రాష్ట్ర విభజన తర్వాత స్మార్ట్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై విస్తృతంగా చర్యలు చేపట్టిన పోలీసుశాఖ మరింత వేగంగా, అంకితభావంతో కూడిన సేవలందించేందుకు చేపట్టాల్సిన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 2014లో ఉన్న పోలీసు సేవలు, మూడేళ్లలో మార్పుల ద్వారా సాధించిన అంశాలపై పూర్తి నివేదిక తయారుచేయాలని డీజీపీ ఆదేశించారు.
డిసెంబర్ 31లోగా అప్‌లోడ్ చేయాల్సిందే...
మిషన్ 2024కు సంబంధించి చర్చించిన అంశాలు, వాటిపై కార్యాచరణ, సాధించిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులంతా సమష్టిగా నివేదికలు రూపొందించి డిసెంబర్ 31లోగా మిషన్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం–సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన telangana 2024.cgg.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 15న ముసాయిదాను సిద్ధం చేసి కార్యాచరణ చేపట్టాలన్నారు.