రౌడీ పోలీస్‌ సస్పెన్షన్‌

Police Constable Suspended In Karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఖాకీ డ్రెస్సు ఉందనే అహంకారంతో కన్నూమిన్నూ కానకుండా డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్న ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్‌పై అర్ధరాత్రి వేళ అకారణంగా దాడి చేసి, నిర్బంధించిన ‘రౌడీ పోలీస్‌’ కె.పద్మారావును సస్పెండ్‌ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే ఆదేశాలు జారీ చేశారు. సాక్షి సబ్‌ ఎడిటర్‌ను అసభ్య పదజాలంతో బూతులు తిట్టి, కొట్టి హింసించిన కొంకటి పద్మారావు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ వల్ల సామాన్య ప్రజల ముందు పోలీసుల ప్రతిష్ట దెబ్బతిన్నదని, అందుకే సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి రుద్రంగి పీఎస్‌కు అటాచ్‌ చేసిన కె.పద్మారావు(హెచ్‌సీ 1720)ను ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ 1964ను ఉల్లంఘించిన నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

కోతిరాంపూర్‌లో నివసించే హెడ్‌ కానిస్టేబుల్‌ కె.పద్మారావు కోనరావుపేట పీఎస్‌లో పనిచేస్తూ అటాచ్‌మెంట్‌ కింద కొత్తగా ఏర్పాటైన రుద్రంగి పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్లు చెవుల రాములు, తన్నీరు వెంకటేష్‌ ఈ నెల 10న అర్ధరాత్రి విధులు ముగించుకొని ‘సాక్షి’ మినీ బస్సులో కోతిరాంపూర్‌ రోడ్డుపై దిగి ఇంటికి వెళ్తుండగా, హెడ్‌ కానిస్టేబుల్‌ పద్మారావు కొడుకు కె.దిలీప్‌ వారిని అడ్డగించి ‘ఇది మా ఏరియా.. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడేం పని?’ అని మద్యంమత్తులో ప్రశ్నించాడు. తాము సాక్షిలో సబ్‌ ఎడిటర్లమని చెప్పినా పట్టించుకోకుండా.. మీ ఐడీకార్డులు చూపించమని డిమాండ్‌ చేశాడు.

వెంకటేశ్‌ ఐడీ కార్డు చూపించి తన ఇంటికి వెళ్లగా, ‘నీకెందుకు చూపించాలి’ అని ప్రశ్నించిన రాములును ‘నేనడిగితే గుర్తింపు కార్డు చూపించవా?’ అని జులుం చేస్తూ తన తండ్రి, హెడ్‌కానిస్టేబుల్‌ పద్మారావు దగ్గరికి తీసుకెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ కె.పద్మారావు ‘నాకొడుకు అడిగితే ఐడీ కార్డు, ఆధార్‌ కార్డులు చూపించరా? ఎక్కడి నుంచి వచ్చినవ్‌ రా అని బూతులు తిడుతూ రాములును చితకబాదాడు. అతని కొడుకు దిలీప్, ఇతర బంధువులు కూడా దాడి చేశారు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించిన రాములును ‘నువ్వెవడివో తెలిసే దాకా ఇక్కడే ఉండాలని తెల్లవారు జాము 2గంటల వరకు ఇంటి ముందు కూర్చోబెట్టాడు.

ఆ సమయంలో 100కు ఫోన్‌ చేసినా ఎవరూ లిఫ్ట్‌ చేయకపోవడంతో రాములు ఎలాగోలా తప్పించుకొని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు వన్‌టౌన్‌ సీఐ తులా శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేసుకొని తండ్రీ కొడుకులను పిలిపించి విచారణ జరిపారు. క్రైం నెంబర్‌ 225/2019 కింద ఐపీసీ 341, 323, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో హెడ్‌ కానిస్టేబుల్‌ పద్మారావు సాక్షి సబ్‌ ఎడిటర్‌ చెవుల రాములుపై దౌర్జన్యం చేసి హింసించినట్లు ప్రాథమికంగా తేలడంతో ఈ మేరకు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు.

13న కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి ఆ రిపోర్టును సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు పంపించారు. ఈ మేరకు కె.పద్మారావును సస్పెండ్‌ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన హెడ్‌ కానిస్టేబుల్‌పై పోలీస్‌ విచారణ కొనసాగుతుందని, రాజన్న సిరిసిల్ల హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, సాక్షి సబ్‌ ఎడిటర్‌ రాములుపై దాడి చేసి నిర్బంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేయడంపై టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానపట్ల మారుతి, కోశాధికారి తాండ్ర శరత్‌ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. అతని కొడుకు దిలీప్‌పై రౌడీషీట్‌ ఓపెన్‌చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top