ఒత్తిడిలో పోలీసన్న.. ఎంత చేసినా దక్కని సంతృప్తి

Police Commits Suicides For Work Pressure In Nizamabad - Sakshi

పోలీసుశాఖలో సిబ్బంది కొరత ప్రభావం అనేక సమస్యలకు కారణం అవుతున్నట్లు తెలుస్తోంది. అసలే సిబ్బంది కొరత... ఆపై విశ్రాంతి లేకుండా డ్యూటీలు.. ఎంత చేసినా దక్కని సంతృప్తి... ఇంకా కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు... ఇలా పోలీసుశాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి మాచారెడ్డి ఠాణాలో హెడ్‌ కానిస్టేబుల్‌ పంతం లచ్చయ్య (57) ఉరివేసుకుని  ఆత్మహత్య ఘటనే నిదర్శనం. 

సాక్షి, నిజామాబాద్‌: జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ సిబ్బంది కొరత ఉంది. చాలా సందర్భాల్లో విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేయాల్సి వస్తోంది. అనేక మంది కానిస్టేబుళ్లు చెబుతున్నారు. గతంలో కంటే బందోబస్తులు పెరిగిపోయాయి. నిరంతరంగా శ్రమించినా ఆశించిన గౌరవం దక్కడం లేదు. ఇంటా బయట ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే క్రమంలో కొంత మంది పోలీసులు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా లో ఇలాంటి ఘటనలు గడిచిన ఏడాది కా లంలో మూడు చోట్ల జరిగాయి.  

ఇటీవల ఘటనలు..  
పని ఒత్తిడి పెరగడం, అధికారుల వేధింపుల కారణంగా గతేడాది ఇద్దరు కానిస్టేబుళ్లు తుపాకీతో కాల్చుకున్నారు. కామారెడ్డి ఏఆర్‌ విభాగంలో పనిచేసే శ్రీనివాస్‌గౌడ్‌ గత మే నెల 3వ తేదిన ట్రెజరీ కార్యాలయంలో గార్డుగా విధులకు హాజరయ్యాడు. సాయంత్రం డ్యూటీలో ఉండగానే తుపాకీతో కాల్చుకున్నాడు. వెంటనే అతడిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించి మెరుగైన వైద్య కోసం హైదరాబా ద్‌కు తరలించారు. కొద్దిరోజులకు అతను కోలుకున్నాడు. గత సెప్టెంబర్‌ 18న ఇందల్‌వాయి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే ప్రకాష్‌రెడ్డి అక్కడి ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు లేవని అప్పట్లో వారి కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసుశాఖ మాత్రం అనారోగ్యం కారణాలను చూపించింది. వాస్తవానికి ఓ కేసు విషయంలో ఉన్నతాధికారుల నుంచి ఎదురైన వేధింపులే కారణమని అప్పట్లో పలువురు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం మాచారెడ్డి ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్‌ లచ్చయ్య ఠాణాలోనే ఉరివేసుకోవడం వెనుక కారణాలు స్పష్టంగా తెలియనప్పటికి పని ఒత్తిడే కావచ్చని ఆరోపణలు ఉన్నాయి.  

విశ్రాంతి లేకుండా విధులు..  
సాధారణంగా 12 గంటలు డ్యూటీ చేసిన పోలీసు సిబ్బందికి 12గంటలు విశ్రాంతి ఉంటుంది. కానీ కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి 60:40 పద్ధతిలో సిబ్బందిని విభజించి కేటాయించారు. ఆ తర్వాత జిల్లా పోలీసు కార్యాలయం ఏర్పాటు, అన్ని విభాగాలకు ఇక్కడి సిబ్బంది నుంచే భర్తీ చేశారు. దీంతో ఠాణాల్లో సిబ్బంది కొరత పెరిగింది. ఒక్కొ ఠాణాలో ఉండాల్సిన అధికారుల సంఖ్య నుంచి సగం వరకే సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గడిచిన ఏడాది కాలంలో డ్యూటీలు పెరిగాయి.  

కుటుంబాలతో గడపలేని పరిస్థితి
ఏడాదిగా ఎన్నికలు, బందోబస్తులు ఎక్కువయ్యాయి. విశ్రాంతి లేకుండా విధులకు హాజరు కావాల్సి వస్తున్నందని ఎంతో మంది కానిస్టేబుళ్లు ఆవేదనకు గురవుతున్నారు. కనీసం కుటుంబాలతో కలిసి గడపలేకపోతున్నామనే బాధను వ్యక్తపర్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవేకాకుండా కొన్ని చోట్ల ఉన్నతాధికారుల నుంచి డ్యూటీల విషయంలో, కేసుల విషయంలో ఒత్తిళ్లు కూడా తప్పడం లేదు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి పోలీసుల పై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తే బాగుటుందని పలువురు భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top