ఇదేనా.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌?

Police Beaten Ammapuram MPTC In Mahabubabad - Sakshi

ఎంపీటీసీపై సీఐ, ఎస్సై దాష్టీకం

నడిరోడ్డుపై కొడుతూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లిన వైనం

బాధితులతో కలసి ధర్నాలో పాల్గొనడమే పాపమా? 

పై చిత్రంలోని సన్నివేశం అంకుశం సినిమాలో అన్యాయాలు చేస్తున్న రౌడీని కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్తున్న సీన్‌ మాదిరిగా ఉంది కదూ.. అయితే, విషయం అది కాదు.. బాధితుల తరపున న్యాయం కోసం నిలబడిన ఓ ప్రజాప్రతినిధిని నడిరోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్న పోలీసులను మీరు చూస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు రెవెన్యూ డివిజన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాయం అడిగిన వారిపై ఇలా ప్రవర్తిస్తే, పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులతో పోలీసులు ఎలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారో వారే చెప్పాలి. 

సాక్షి, మహబూబాబాద్‌ : బాధితులు ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వస్తే వారికి తగిన మర్యాద ఇచ్చి, వారు ఎందుకు వచ్చారో వివరాలు తెలుసుకుని సాయం చేయాలని బాస్‌లు పదేపదే పలు సందర్భాల్లో చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు చేరువై, వారికి తగిన సాయం అందించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కింది స్థాయి సిబ్బంది మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.  

మంత్రి ఇలాఖాలో.. 
ఈనెల 5వ తేదీన తొర్రూరు పెద్ద చెరువు కట్టపై ట్రాక్టర్‌ బోల్తా పడి శ్రీను మృతి చెందాడు. ఈ ఘటనలో ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని వారి బంధువులు, గ్రామస్తులు తొర్రూరు మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ మేరకు మద్దతుగా అమ్మాపురానికి చెందిన ఎంపీటీసీ ముద్దం విక్రంరెడ్డి అక్కడికి చేరుకునే సరికే ట్రాఫిక్‌జామ్‌ అయింది. అయితే, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా.. న్యాయం చేస్తేనే వెళ్తామని బాధితులు అన్నారు. దీంతో పోలీసులకే ఎదురు చెబుతావా అంటూ.. అక్కడ ఉన్న ఎంపీటీసీ విక్రంరెడ్డిని కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై మీడియాలో వైరల్‌ కావడంతో ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అని సా«ధారణ ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. కాగా, తొర్రూరు మండలం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోకి వస్తుండగా.. దెబ్బలు తిన్న ఎంపీటీసీ విక్రంరెడ్డి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచారు. 

తొర్రూరు సీఐ, ఎస్సైను సస్పెండ్‌ చేయాలి: ఎంపీటీసీ 
ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా తనపై ఇష్టం వచ్చినట్లు దాడిచేసి కొట్టిన తొర్రూరు సీఐ చేరాలు, సెకండ్‌ ఎస్సై కరీముల్లాను సస్పెండ్‌ చేయాలని తొర్రూరు మండలం అమ్మాపురం ఎంపీటీసీ సభ్యుడు ముద్దం విక్రంరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఒక ఎంపీటీసీ సభ్యుడిని అని కూడా చూడకుండా తొర్రూరు సీఐ చేరాలు, సెకండ్‌ ఎస్సై కరీముల్లా కింద పడేసి బూటుకాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లారన్నారు.

విచారణ చేపడుతున్నాం
తొర్రూరులో జరిగిన సంఘటన పై విచారణ కమిటీ నియమించాం. రెండు రోజుల్లో కమిటీ నివేదిక అందగానే ఉన్నతాధికారులకు పంపిస్తాం. ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. -నంద్యాల కోటిరెడ్డి, ఎస్పీ మహబూబాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top