వరంగల్: దొంగల ముఠా అరెస్ట్‌ 

Police Arrested Burglar Gang In Warangal District - Sakshi

రూ.5.50లక్షల నగదు, 162 గ్రాముల బంగారం, అరకిలో వెండి, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన క్రైం ఏసీపీ బాబు రావు

సాక్షి, కాజీపేట అర్బన్‌ : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను శుక్రవారం అరెస్ట్‌ చేసినట్లు క్రైం ఏసీపీ బాబురావు తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీకి చెందిన కోటగిరి సునీల్, కోటగిరి రాజు, చెట్టె ప్రసాద్, చెట్టె సురేష్‌లతో పాటు దామెర మండలంలోని ఊరుగొండ గ్రామానికి చెందిన మేకల రాములు ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. సమీపబంధువులైన ఈ ఐదుగురు  జల్సాలకు మోజులో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. 2005 నుంచి చోరీలకు పాల్పడడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

నిందితులు గతంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని శాయంపేట, పరకాల, గీసుకొండ, మామూనూర్, ఆత్మకూర్, ఇంతేజార్‌గంజ్, మట్టెవాడ, కాజీపేట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడగా పలుమార్లు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించామన్నారు. ఈనెల 5వ తేదిన కాజీపేట బాపూజీనగర్‌లోని ఓ ఇంట్లో మహిళను తాగేందుకు నీరివ్వమని మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న నగల బ్యాగును దొంగిలించారు. దీంతో సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2015లో ఖమ్మం జిల్లా ఇల్లంద ప్రాంతంలో ఇదే విధంగా చోరీలకు పాల్పడడంతో సీసీఎస్‌ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులకు సంబంధించిన ఫొటోలను సేకరించి వారి కదలికపై దృష్టి సారించారు.

కాగా శుక్రవారం చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్యాసింజర్‌ ఆటోలో కాజీపేట రైల్వే స్టేషన్‌కు వస్తున్నట్లు సమాచారం అందుకున్న సీసీఎస్‌ పోలీసులు రైల్వే స్టేడియం వద్ద గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తారసపడిన ముఠాను విచారించగా చోరీలకు పాల్పడిన విషయాన్ని ఒప్పుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. క్రైం ఏసీపీ బాబురావు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్లు రవిరాజు, శ్రీనివాస్‌రావు, కాజీపేట ఇన్స్‌పెక్టర్‌ అజయ్, ఎఎస్సై శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్‌ నజీరుధ్ధీలను సీపీ రవీందర్‌ అభినందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top