జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ‘పీఎం ఎక్సలెన్సీ’ ప్రదానం

PM Excellence award to the GHMC Commissioner - Sakshi

దక్షిణాది నుంచి ఇద్దరు ఐఏఎస్‌లకు అవార్డులు  

  ఇద్దరూ తెలంగాణ వారే

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ పాలనా విభాగంలో కేంద్రం అందజేసే ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రదానం చేశారు. సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యున్నత ఫలితాలు సాధించిన 13 మంది ఐఏఎస్‌ అధికారులకు అవార్డులను అందజేశారు. దక్షిణ భారత దేశం మొత్తంలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు ఈ అవార్డులు లభించగా, ఆ ఇద్దరూ తెలంగాణకు చెందినవారే కావడం విశేషం.

ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కార్యక్రమం కింద జీహెచ్‌ఎంసీలో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని సమర్థవంతంగా చేపట్టినందుకు గుర్తింపుగా జనార్దన్‌రెడ్డిని ఈ అవార్డు వరించింది. కార్యక్రమానికి జనార్దన్‌రెడ్డి సతీమణి సులోచన, కుమారుడు రాహుల్‌ కూడా హాజరయ్యారు. అవార్డుల బహూకరణకు ముందు హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ, లబ్ధిదారుల వివరాలతో కూడిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ కార్యక్రమాల విజయగాథలతో ప్రచురించిన ప్రత్యేక సావనీర్‌లో జీహెచ్‌ఎంసీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విజయప్రస్థానంపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించారు.  

స్వచ్ఛ నమస్కారానికి ప్రధాని అభినందన
ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డును స్వీకరించేందుకు వేదికపైకి వెళ్లిన జనార్దన్‌రెడ్డి ప్రధానమంత్రిని ఉద్దేశించి ‘స్వచ్ఛ నమస్కారం’అంటూ అభివాదం చేశారు. స్వచ్ఛభారత్‌ స్పూర్తిని కలిగించేలా ఉన్న ఆ సంబోధన ప్రధానిని ఆకట్టుకుంది. దీంతో జనార్దన్‌రెడ్డిని మోదీ అభినందించారు.  

గురుశిష్యులకు అవార్డులు.. 
కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు పీఎం ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. జనార్దన్‌రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో సర్ఫరాజ్‌ అహ్మద్‌ శిక్షణ ఐఏఎస్‌ అధికారిగా విధుల్లో చేరారు. జనార్దన్‌రెడ్డి వద్ద శిక్షణ పొందిన సర్ఫరాజ్‌కు కూడా ఈ అవార్డు దక్కడంతో వీరిద్దరి     అనుబంధాన్ని పలువురు అధికారులు ప్రస్తావించారు.  

మరింత ఉత్సాహం.. మరింత శక్తి: జనార్దన్‌రెడ్డి 
పైస్థాయి నుంచి అందే ఇలాంటి వాటివల్ల మరింత శక్తిసామర్థ్యాలతో సంతోషంగా పనిచేసే వీలు కలుగుతుంది. సివిల్‌ సర్వీసెస్‌ ఉండాల్సిందేనని చెప్పిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, అవార్డు అందజేయడం ద్వారా నూతనోత్తేజాన్ని కలిగించిన ప్రధాని నరేంద్రమోదీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top