ఊడలమర్రికి ఊపిరి!

Pillalamarri Tree Treatment Started For Rescue - Sakshi

పిల్లలమర్రికి పూర్వవైభవం 

చెట్టుకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ 

సెలైన్లతో కొనసాగుతున్న చికిత్స   

వారం రోజుల్లో సందర్శకులకు అనుమతి 

ఉమ్మడి పాలమూరు జిల్లా చరిత్రకు తలమానికంగా నిలిచిన పిల్లలమర్రి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది.  750 ఏళ్ల చరిత్ర కలిగిన ఊడలమర్రి శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మొదలు చిక్కని చెట్టుగా ఎదిగింది. విశాలంగా ఎదిగిన ఈ మహావృక్షం పర్యాటకులకు ఎంతగానో ఆహ్లాదం పంచిం ది. చెదల కారణంగా శాఖలన్నీ విరిగిపోయే దశకు చేరుకున్నాయి. కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో ట్రిట్‌మెంట్‌ ఇప్పిస్తున్నారు. మరోవారం రోజుల్లో సందర్శకులకు విడిదికేంద్రంగా మారనుంది. 
 – స్టేషన్‌ మహబూబ్‌నగర్‌  

పిల్లలమర్రికి సంబంధించిన ఓ ప్రధాన భారీ కొమ్మ గతేడాది డిసెంబర్‌ 16న విరిగిపడింది. చెట్టు ఆవరణలోని మరికొన్ని కొమ్మలు విరిగిపడే దశకు చేరుకున్నాయి. వెంటనే అధికారులు స్పందించి చెట్టుకు ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించారు. విరిగిన కొమ్మవద్ద గోడ కట్టి ఎర్రమట్టితో కప్పారు. చెట్టుకు పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత పిల్లలమర్రిలో పర్యాటకులకు అనుమతించాలని జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆదేశించారు.

దీంతో డిసెంబర్‌ 20న పిల్లలమర్రిని మూసివేశారు. పిల్లలమర్రి ట్రీట్‌మెంట్‌ బాధ్యతను అటవీశాఖకు అప్పగించారు. పిల్లలమర్రి పరిరక్షణకు అటవీశాఖ అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. కొమ్మలు విరుగుతున్న చోట సహాయంగా పిల్లర్లు కట్టారు. చెట్టుకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. సెలైన్లతో క్లోరోపైరిపస్‌ మందును అందిస్తున్నారు. చెట్టు వేళ్లలో ఇదే మందును వాడుతున్నారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్‌ఫాస్పెట్‌ను చల్లుతున్నారు. 

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికే తలమానికంగా నిలిచిన పిల్లలమర్రి(ఊడలమర్రి) 750ఏళ్ల క్రితం మొలకెత్తిన మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది అంతుచిక్కని మహా వృక్షంగా ఎదిగింది. నాలుగెకరాల్లో విస్తరించిన మహా(మర్రి)వృక్షం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రజలకు చల్లటి నీడనిస్తూ వారిని తన నీడలో సేద తీరేందుకు పిల్లలమర్రి తన ఒడిలో చేర్చుకుంటోంది. జిల్లా కేంద్రం నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి పిక్‌నిక్‌ స్పాట్‌గా అందరిని అలరిస్తుంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడు గులాంటి ఈ భారీ మర్రివక్షం వయస్సు సుమారు 750ఏళ్లు ఉంటుందని చెబుతారు. ఈ చెట్టు కింద ఒకేసారి వెయ్యిమంది హాయిగా సేద తీరొచ్చు. 

వారంరోజుల్లో  పర్యాటకులకు అనుమతి 
చెట్టుకు అందిస్తున్న ట్రీట్‌మెంట్‌ చివరిదశకు చేరింది. మరో వారం రోజుల్లో ట్రీట్‌మెంట్‌ను పూర్తిచేసి పర్యాటకులను అనుమతించడానికి అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పిల్లలమర్రికి పూర్వవైభవం వస్తుండడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం 
చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top