గజగజ 

Phethai Cyclone Effect Cold Increased - Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌:  పెథాయ్‌ తుపాన్‌ వణుకు పుట్టిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా గజగజలాడాల్సి వస్తోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు కురిసిన వర్షం వల్ల జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు 24 డిగ్రీలు ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 18 డిగ్రీలకు పడిపోయింది. చలికాలం ప్రారంభంలో కూడా ఇంతటి ప్రభావం కనిపించలేదు. ఆదివారం నుంచి చలిగాలులు వీస్తున్నప్పటికీ సోమ, మంగళవారాల్లో చలి పంజా విసిరి.. ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు చేరాయి.

చలి తీవ్రత ఇంకా రెండు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటనలు చేయడం, శీతల గాలులతోపాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఎలా తట్టుకోవాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్తమా రోగులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు చలితో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌ల కోసం నేపాలీ షాపుల వద్ద కు పరిగెడుతున్నారు. రోజువారీ పనులకు వెళ్లే వారు సైతం బయటకు రావాలంటే జంకుతున్నారు.  

వణికిస్తున్న చలి.. 
ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు గతం అంత గా తగ్గనప్పటికీ తుపాన్‌ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలిగాలులు ఎక్కువయ్యా యి. దీంతో మూడు రోజుల నుంచి తీవ్రమైన చలితో జిల్లా ప్రజలు గజగజలాడుతున్నారు. పట్టణాలకంటే పల్లెలు, మారుమూల అటవీ ప్రాంతా ల్లో చలి తీవ్రత అధికంగా ఉండడంతో గిరిజన గూడేల్లో నెగడ్లు(మంటలు) పెట్టుకొని చలి కాగుతున్నారు. చలి తీవ్రత కారణంగా ఉదయం.. సాయంత్రం అని తేడా లేకుండా ఇంటికే పరిమితమవుతున్నారు. బయటకు అడుగు వేయాలంటే భయపడుతున్నారు. ఇక వృద్ధులు, పిల్లలు, గర్భిణులు రాత్రి.. పగలు తేడా లేకుండా దుప్పటిని వీడడం లేదు. దీంతో రాత్రి 11 గంటల వరకు జనసందోహంతో ఉండే పట్టణాల్లోని ప్రధాన వీధులు ఆరు గంటలకే నిర్మానుష్యంగా మారుతున్నాయి.

పూరి గుడిసెలో ఉన్నవారితోపాటు కిటికీలు, తలుపులు లేని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు చలికి వణుకుతూ ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే లేవాల్సిన పేపర్‌ బాయ్‌లు, పాలు, కూరగాయల వ్యాపారులు చలి నుంచి కాపాడుకునేందుకు దుప్పట్లు కప్పుకొని పనుల్లోకి వస్తున్నారు. రాత్రిపూట పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వణుకుతూనే పనులు చేయాల్సి వస్తోంది. చలి తీవ్రత పెరగడంతో శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో మార్పులు వస్తాయని, ఇందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.  

చలి జాగ్రత్తలు ఇలా.. 

  • సాధ్యమైనంత వరకు పసిపిల్లలను బయట తిప్పొద్దు.  
  • రాత్రి పడుకునే ముందు ముఖానికి పాండ్స్‌ రాయాలి. 
  • కాళ్లు, చేతులను కప్పి ఉంచే ఉన్ని దుస్తులను ఎంపిక చేసుకొని పిల్లలకు తొడిగించాలి. 
  • పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి.  
  • సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. 
  • ఉదయం 10 గంటలు దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్‌ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు పంపించొద్దు.

అప్రమత్తత అవసరం 
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నూలు, ఉన్ని దుస్తులు ధరించాలి. చెవుల్లోకి చలిగాలి వెళ్లకుండా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే నిమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. వెంటనే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. ఉదయం 10 దాటిన తర్వాతే బయటకు తీసుకురావాలి. స్కూల్‌ పిల్లలకు వేడి నీటితోనే స్నానం చేయించాలి. సాయంత్రం ఇంటి నుంచి బయటకు పంపించొద్దు. – గంగరాజు, జనరల్‌ ఫిజీషియన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top